వీసా బ్యాన్‌పై కసరత్తు!

10 May, 2020 04:34 IST|Sakshi

వాషింగ్టన్‌: హెచ్‌1బీ సహా పలు రకాల వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అమెరికా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్క్‌ ఆథరైజేషన్‌తో కూడిన స్టుడెంట్‌ వీసాలపై నిషేధం విధించాలని భావిస్తోంది. కరోనా కారణంగా అమెరికా ఉద్యోగరంగంలో నెలకొన్న సంక్షోభంతో వర్క్‌ వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ట్రంప్‌ సర్కారు యోచిస్తోంది. సాంకేతిక, ఇతర నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగావకాశం కల్పించేదే హెచ్‌1బీ వీసా. ఈ వీసాకు భారత్, చైనాలో భారీ డిమాండ్‌ ఉంది. ఈ వీసాపై ప్రస్తుతం దాదాపు 5 లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉన్నారు.

‘వర్క్‌ వీసాల నిషేధానికి సంబంధించి ఈ నెలలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడవచ్చు. ఈ దిశగా ఇమిగ్రేషన్‌ సలహాదారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు’అని శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడే వైద్య నిపుణుల కొరత తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న 40 వేల గ్రీన్‌కార్డులను విదేశీ వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ ఆమోదం పొంది, జారీ చేయని గ్రీన్‌ కార్డ్‌లను ఇప్పుడు వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ పలువురు సభ్యులు కాంగ్రెస్‌లో ప్రతిపాదన చేశారు.

మరిన్ని వార్తలు