ఇది చైనా పాపమే : ట్రంప్‌

20 Mar, 2020 10:34 IST|Sakshi

న్యూయార్క్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌పై ప్రాథమిక సమాచారం అందించకుండా చైనా గోప్యత పాటించడం వల్లే ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకుంటోందని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ డ్రాగన్‌పై విరుచుకుపడ్డారు. కరోనా మహమ్మారి ప్రజారోగ్యాన్ని హరించేందుకు చైనాయే కారణమని ట్రంప్‌ నేరుగా బీజింగ్‌ను తప్పుపట్టారు. కరోనా వైరస్‌పై కొద్దినెలలు ముందుగా మనకు సమాచారం ఉంటే బాగుండేదని, చైనాలో ఈ వైరస్‌ పుట్టుకొచ్చిన ప్రాంతానికే దాన్ని కట్టడి చేసి ఉండాల్సిందని వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో​ ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ మాయదారి వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల్లోని 2,10,300 మందికి సోకగా 9000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. (చదవండి : అవును అది చైనా వైరసే..)

వారు (చైనా) చేసిన పనికి ప్రపంచం భారీ మూల్యం చెల్లిస్తోందని, వారు ఈ వైరస్‌కు సంబంధించిన సమాచారం వెల్లడించలేదని మండిపడ్డారు. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎన్‌ఎస్‌సీ) చేసిన ట్వీట్‌పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కరోనా వైరస్‌పై ప్రాథమిక వివరాలను బయటకు పొక్కకుండా నొక్కివేసిందని, దీంతో ఈ మహమ్మారిని నిరోధించే అవకాశం చైనా, అంతర్జాతీయ వైద్య నిపుణులకు లేకుండా పోయిందని ఎన్‌ఎస్‌ఈ చేసిన ట్వీట్‌ కలకలం రేపింది. (కరోనా మరణాల్లో చైనాను మించిన ఇటలీ)

ఇక ఈ వైరస్‌ గురించి ముందుగా తెలిసిన వారు దాన్ని అక్కడే నిలుపుదల చేసి ఉండాల్సిందని, వారు చేసిన పనికి ఇప్పుడు ప్రపంచమంతా వైరస్‌ బారిన పడి విలవిలలాడుతోందని, ఇది సరైంది కానేకాదని చైనా తీరును ట్రంప్‌ తప్పుపట్టారు. చైనాపై ప్రతీకారం తీర్చుకుంటారా అన్న ప్రశ్నపై ట్రంప్‌ స్పందించలేదు. కాగా, గత ఏడాది డిసెంబర్‌ 31న సోషల్‌ మీడియాలో వైరస్‌ గురించి తొలిసారిగా రాసి, ఆ తర్వాత కోవిడ్‌-19తో మరణించిన డాక్టర్‌ లీ వెలింగ్‌ను స్ధానిక పోలీసులు వైరస్‌పై నోరుమెదపవద్దని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. (విమానం దిగగానే క్వారంటైన్కే..)

మరిన్ని వార్తలు