అమెరికా ఎన్నికల్లో కుట్ర లేదు

26 Mar, 2019 03:50 IST|Sakshi
వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్‌

రష్యా జోక్యంపై ఆధారాల్లేవు

తేల్చిన ముల్లర్‌ విచారణ

రెండేళ్ల వివాదంలో అధ్యక్షుడు ట్రంప్‌కు ఊరట

నాపై ఇలాంటి విచారణ సిగ్గుచేటు: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గొప్ప ఊరట లభించింది. 2016లో ప్రచార సమయంలో ట్రంప్‌ ప్రచార బృందం రష్యాతో కలసి కుట్రకు పాల్పడిందనడానికి ఆధారాలు లేవని విచారణ కమిటీ తేల్చింది. సుమారు రెండేళ్లుగా ట్రంప్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించిన ఈ వ్యవహారంపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్‌ ముల్లర్‌ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

ముల్లర్‌ సమర్పించిన నివేదికను సమీక్షించిన అటార్నీ జనరల్‌ విలియం బార్‌ అందులోని సారాంశంతో నాలుగు పేజీల లేఖను ఆదివారం అమెరికా కాంగ్రెస్‌ ముందుకు తెచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నాలు, విచారణకు ట్రంప్‌ అడ్డుపడ్డారా? లాంటి విషయాలను బార్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. ట్రంప్‌ ప్రచారానికి సాయం చేస్తామని రష్యా నుంచి పలు వ్యక్తిగత ప్రతిపాదనలు వచ్చినా, ఎన్నికల్లో ఎలాంటి కుట్ర జరగలేదని ముల్లర్‌ విచారణలో తేలిందని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడిపై ఇలాంటి విచారణ జరగడం సిగ్గుచేటని ట్రంప్‌ పేర్కొన్నారు. ముల్లర్‌ నివేదికను సంపూర్ణంగా బహిర్గతం చేయాలని విపక్ష డెమొక్రాట్లు డిమాండ్‌ చేశారు. ఇన్నాళ్లుగా ట్రంప్‌ చెబుతున్నదే నిజమని రుజువైందని శ్వేతసౌధం వ్యాఖ్యానించింది. ముల్లర్‌ నివేదికను బహిర్గతం చేసినా ట్రంప్‌కు ఎలాంటి సమస్య ఉండదని తెలిపింది. ముల్లర్‌ విచారణ ముగిసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము జోక్యం చేసుకున్నామన్న ఆరోపణల్ని రష్యా మరోసారి తోసిపుచ్చింది.

ఆ నిర్ణయాలు ‘అడ్డగింత’తో సమానమా?
ట్రంప్‌ ప్రచార బృందం లేదా సంబంధిత వ్యక్తులు 2016 ఎన్నికల సమయంలో రష్యాతో కలసి పనిచేశారనడానికి, కుట్రకు పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ముల్లర్‌ నివేదిక పేర్కొన్నట్లు బార్‌ తన లేఖలో కాంగ్రెస్‌ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ట్రంప్‌ చట్టవిరుద్ధంగా విచారణ ప్రక్రియకు అడ్డుతగిలారా? లేదా? అన్న విషయంలో ముల్లర్‌ ఓ నిర్ధారణకు రాలేకపోయారని తెలిపారు. ట్రంప్‌ న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించారని నివేదిక తేల్చకపోయినా, ఈ వ్యవహారంలో ఆయన్ని నిర్దోషిగా ప్రకటించలేదని వెల్లడించారు.

విచారణ సమయంలో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు న్యాయ ప్రక్రియను అడ్డుకోవడంతో సమానమా? లాంటివి చాలా క్లిష్టమైన అంశాలని, కాబట్టి వాటి జోలికి పోకూడదని ముల్లర్‌ నిర్ణయించినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీని తొలగించడంతో పాటు ట్రంప్‌ తీసుకున్న ఇతర నిర్ణయాలు విచారణపై పలు సందేహాలకు తావిచ్చాయి. ముల్లర్‌ విచారణ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించాలని డెమొక్రాట్లు యోచిస్తున్నారు.

రష్యాతో ట్రంప్‌ కుమ్మక్కయినట్లు తేలితే, ఆయనను అభిశంసించాలని కూడా ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో రష్యా జోక్యం ఆరోపణల నుంచి తనకు సంపూర్ణ విముక్తి లభించిందని ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. బార్‌ లేఖతో ఎన్ని సమాధానాలు లభించాయో అంతే సంఖ్యలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని డెమొక్రాట్లు ఆరోపించారు. తాను నిర్దోషినని ప్రకటించుకున్న ట్రంప్‌ వ్యాఖ్యలు ముల్లర్‌ నివేదికకు విరుద్ధంగా ఉన్నాయని, కాబట్టి ఆయన మాటల్ని విశ్వసించరాదని పేర్కొన్నారు. ముల్లర్‌ పూర్తి నివేదికను పరిశీలించాలని బార్‌కు సూచించారు.

మరిన్ని వార్తలు