కీలక ప్రైమరీల్లోనూ వారిదే హవా

17 Mar, 2016 02:07 IST|Sakshi
కీలక ప్రైమరీల్లోనూ వారిదే హవా

♦ ‘రెండో సూపర్ ట్యూస్‌డే’లో ట్రంప్, హిల్లరీ ఘనవిజయం  
♦ ట్రంప్ దెబ్బకు రుబియో అవుట్
 
 క్లీవ్‌లాండ్/వాషింగ్టన్: ‘రెండో సూపర్ ట్యూస్‌డే’గా అభివర్ణించిన కీలకమైన 5 రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఘన విజయాలు సాధించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి సంబంధించి రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డె మోక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీ నామినేషన్ సాధించే దిశగా దూసుకుపోతున్నారు. తన సొంత రాష్ట్రం ఫ్లారిడాలో ట్రంప్ చేతిలో రుబియో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన పోటీకి దూరం కావాల్సి వచ్చింది.

 ఐదు రాష్ట్రాల్లోనూ హిల్లరీ ముందంజ
 ఇలినాయ్, ఫ్లారిడా, మిస్సోరి, నార్త్ కరోలినా, ఒహయో రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో హిల్లరీ ఐదింటిలోనూ ముందంజలో నిలిచారు. కాకుంటే ఆమె ప్రత్యర్థి శాండర్స్ రెండు (ఇల్లినాయ్, మిస్సోరీ) రాష్ట్రాల్లో పోటాపోటీగా నిలిచారు. ఈ రెండు రాష్ట్రాల్లో హిల్లరీకి 51 శాతం, 50 శాతం ఓట్లు పోలవగా.. శాండర్స్‌కు రెండింటిలోనూ 49 శాతం ఓట్లు లభించాయి. డెమోక్రటిక్ పార్టీ నామినేషన్‌కు 4,763 మంది పార్టీ డెలిగేట్లలో 2,382 మంది మద్దతు అవసరం. అయితే తాజా ఫలితాలతో ఇప్పటికి హిల్లరీ 1,561 మంది, శాండర్స్ 800 మంది డెలిగేట్ల మద్దతు సాధించారు.

 మూడు రాష్ట్రాల్లో ట్రంప్: ట్రంప్ మూడు (ఫ్లారిడా, ఇలినాయ్, నార్త్ కరోలినా) రాష్ట్రాల్లో ముందంజలో ఉండగా.. మిస్సోరిలో మాత్రం క్రూజ్‌తో సమానంగా 41% ఓట్లు సాధించారు. ఒహయోలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఒహయో గవర్నర్ జాన్ కాషిష్ 47 శాతం ఓట్లతో విజయం సాధించారు. దీంతో ట్రంప్ 661 మంది, క్రూజ్ 405 మంది, రుబియో 161, కాషిష్ 141 మంది డెలిగేట్ల మద్దతు సాధించినట్లయింది. రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌కు 1,237 మంది డెలిగేట్ల మద్దతు అవసరమన్న సంగతి తెలిసిందే.

 అల్లర్లు జరుగుతాయి: ట్రంప్
 ట్రంప్ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినీగా తాను ఎన్నికవకపోతే అల్లర్లు చెలరేగుతాయని హెచ్చరించారు. పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన తనకు ఆ అవకాశం రాదని భావించవద్దని సీఎన్‌ఎన్ చానల్‌తో చెప్పారు.
 
 ప్రవాస భారతీయుడి విజయం
 వాషింగ్టన్: ఇలినాయ్‌లో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ ప్రైమరీ ఎన్నికల్లో ప్రవాస భారతీయుడు రాజా కృష్ణమూర్తి ఘన విజయం సాధించారు. 8వ కాంగ్రెసేనియల్ జిల్లాలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన స్టేట్ సెనెటర్ మైక్ నోలాండ్‌పై భారీ విజయం సాధించారు. కృష్ణమూర్తికి 57 శాతం ఓట్లు రాగా నోలాండ్‌కు 29 శాతం, మరో పోటీదారు డెబ్ బుల్‌వింకెల్‌కు 13 శాతం ఓట్లు లభించాయి. ఢిల్లీలో జన్మించిన 43 ఏళ్ల కృష్ణమూర్తి న్యాయవాదిగా, వ్యాపారవేత్తగా ప్రసిద్ధులు.

>
మరిన్ని వార్తలు