11 ఉగ్ర సంస్థలపై ఆంక్షలు

12 Sep, 2019 04:20 IST|Sakshi
వైట్‌హౌజ్‌లో నివాళులర్పిస్తున్న ట్రంప్‌ దంపతులు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉత్తర్వులు

వాషింగ్టన్‌: ఉగ్రవాదంపై పోరును అమెరికా ముమ్మరం చేసింది. అల్‌కాయిదా దాడులు (9/11) జరిగి 18 ఏళ్లు అయిన సందర్భంగా ట్రంప్‌ ప్రభుత్వం బుధవారం సుమారు 11 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్‌ ఏ తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ)కు చెందిన ముఫ్తీ నూర్‌ వలీ మెహ్‌సూద్‌పై ఆంక్షల కొరడా ఝుళిపించింది. ముల్లా ఫజల్‌ మరణం తరువాత గత ఏడాది జూన్‌ నుంచి నూర్‌ వలీ టీటీపీకి నేతృత్వం వహిస్తున్నారని, పలు ఉగ్రదాడులకు కారణమైన అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నామని ట్రంప్‌ ప్రభుత్వం తెలిపింది.

ఈ ఆంక్షల ఉత్తర్వుల కారణంగా ఈ ఉగ్రవాదులను వెతికిపట్టుకోవడం, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ఉగ్రవాద శిక్షణలో పాల్గొన్న వారిని బంధించడం సులువు అవుతుందని ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్‌ మంచిన్‌ తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు సాయం అందించే, వారితో ఆర్థిక వ్యవహారాలు జరిపే ఆర్థిక సంస్థ లపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు వీలుగా బుధవారం కొన్ని ఉత్తర్వులు జారీ చేసినట్లు మంచిన్‌ తెలిపారు. ఇరాన్‌లోని కుడ్స్‌ ఫోర్సెస్, హమాస్, ఐసిస్, అల్‌ఖైదా వాటి అనుబంధ సంస్థలపై ఈ ఉత్తర్వుల ప్రభావం ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు