ఆమెతో ట్రంప్‌ తింగరి చేష్టలు

14 Jul, 2018 10:48 IST|Sakshi

బ్రిటన్‌ ప్రధానితోసహా దేశం మొత్తం గౌరవించే లండన్‌ రాణి ముందు.. అమెరికా అధ్యక్షుడు చేసిన ఓ ఫీట్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. తీవ్ర నిరసనల మధ్యే డొనాల్డ్‌ ట్రంప్‌ యూకే పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం విండ్‌సోర్‌ క్యాసల్‌లో రెడ్‌ కార్పెట్‌పై ట్రంప్‌.. క్వీన్‌ ఎలిజబెత్‌-2(ఎలిజబెత్‌ అలెగ్జాండ్ర మేరీ)తో కలిసి సైనిక వందనం స్వీకరించారు. కార్పెట్‌పై నడుస్తున్న సమయంలో రాణిని దాటేసి.. ట్రంప్‌ ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. ఆ వెంటనే ఒక్కసారిగా ఆగి ఆమె కోసం వెనక్కి తిరగ్గా.. పక్కనుంచి క్వీన్‌ ముందుకొచ్చేశారు. ఇది సాధారణంగా అనిపించినప్పటికీ.. యూకే వాసుల మనోభావాలను మాత్రం దెబ్బతీసింది. 

‘రాణిని దాటి ముందుకెళ్తావా? ఎంత ధైర్యం.. మహామహులే రాణి ముందు మోకరిల్లుతారు? నువ్వెంత.. అసలే నీ మీద కాకతో ఉన్నాం, ఇలాంటి సమయంలో తింగరి చేష్టలు చేస్తావా?’ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. 1992లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని పౌల్‌ కేటింగ్‌ రాణి వెనకాల చెయ్యేసి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా.. ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తూ కథనాలు వెలువడ్డాయి. 

నిరసనల మధ్యే... ఇదిలా ఉంటే ట్రంప్‌ పర్యటనను నిరసిస్తూ లండన్‌లో పెద్ద ఎత్తున్న నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ట్రంప్‌ లండన్‌లో అడుగుపెట్టే కొద్దిగంటల ముందు ట్రఫల్గర్‌ స్క్వేర్‌లో ట్రంప్‌ ముఖంతో ఉన్న ఆరెంజ్‌ బెలూన్‌ను ఎగరేసి నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. గో బ్యాక్‌ అంటూ నినాదాలతో పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. 

మరిన్ని వార్తలు