ఉన్నత పదవుల్లో ఇండో అమెరికన్లు

18 Jan, 2019 03:41 IST|Sakshi
రీటా బరన్వాల్‌, బిమల్‌ పటేల్‌, ఆదిత్య బమ్జాయ్‌

నిఘా కమిటీలో రాజాకృష్ణమూర్తి

మరో ముగ్గురిని కీలక స్థానాలకు నామినేట్‌ చేసిన ట్రంప్‌

వాషింగ్టన్‌: ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాల్లో నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నామినేట్‌ చేశారు.  ప్రస్తుతం గేట్‌వే ఫర్‌ యాక్సెలరేటెడ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ న్యూక్లియర్‌ (గెయిన్‌) డైరెక్టర్‌గా ఉన్న రీటా బరన్వాల్‌ను ఇంధన శాఖ (అణు ఇంధన) అసిస్టెంట్‌ సెక్రటరీగా, న్యాయవాద అధ్యాపకుడిగా ఉన్న ఆదిత్య బమ్జాయ్‌ని ప్రైవసీ అండ్‌ సివిల్‌ లిబర్టీస్‌ ఓవర్‌సైట్‌ బోర్డు సభ్యుడిగా, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ ఓవర్‌సైట్‌ కౌన్సిల్‌లో డెప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్న బిమల్‌ పటేల్‌ను ట్రెజరీ అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమించేందుకు ట్రంప్‌ ప్రతిపాదించారు.

ఈ విషయాన్ని ట్రంప్‌ ముందుగానే ప్రకటించినప్పటికీ, నామినేషన్లను బుధవారమే శ్వేతసౌధం నుంచి సెనెట్‌కు పంపారు. ఇప్పటికవరకు మొత్తంగా ట్రంప్‌ 35 మందికి పైగా భారతీయ అమెరికన్లను కీలక స్థానాల్లో నియమించారు. బరన్వాల్‌ కొత్త బాధ్యతల్లో భాగంగా అణు ఇంధన కార్యాలయ పాలనా వ్యవహారాలతో పాటు, అణు సాంకేతికత పరిశోధన, అభివృద్ధి విభాగం, మౌలిక సదుపాయాల విభాగ యాజమాన్య బాధ్యతలు కూడా చూడాల్సి వుంటుంది. టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ అండ్‌ అప్లికేషన్‌ డైరెక్టర్‌గా, మెటీరియల్స్‌ టెక్నాలజీ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. అమెరికా నౌకాదళ రియాక్టర్లకు అవసరమైన అణు ఇంధన మెటీరియల్‌పై పరిశోధన జరిపారు.

ఇక యేల్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించిన ఆదిత్యకు సివిల్‌ ప్రొసీజర్, పాలనాపరమైన శాసనాలు, ఫెడరల్‌ కోర్టులు, జాతీయ భద్రతా చట్టం, కంప్యూటర్‌ సంబంధిత నేరాలపై బోధన జరిపిన, రచనలు చేసిన అనుభవముంది. యూఎస్‌ సుప్రీంకోర్టు జస్టిస్‌ అంటోనిన్‌ స్కలియా వద్ద, అప్పీల్స్‌ కోర్టు (ఆరవ సర్క్యూట్‌) జడ్జి జెఫ్రీ వద్ద లా క్లర్క్‌గా విధులు నిర్వర్తించారు. అమెరికా న్యాయశాఖలో అటార్నీ అడ్వయిజర్‌గా, ప్రైవేటు రంగంలో అప్పిలేట్‌ అటార్నీగా కూడా పని చేశారు. మూడో వ్యక్తి బిమల్‌ పటేల్‌ ప్రస్తుతం ఆర్థిక స్థిరత్వ వ్యవహారాల పర్యవేక్షణ మండలికి సంబంధించిన ట్రెజరీలో డిప్యూటీ అసిస్టెంటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పలు సంస్థలకు సలహాలిచ్చిన అనుభవముంది.

తొలి దక్షిణాసియా వ్యక్తి
డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తికి నిఘాపై ఏర్పాటైన కాంగ్రెషనల్‌ కమిటీలో చోటు దక్కింది. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి దక్షిణాసియా వ్యక్తి ఈయనే. అమెరికా జాతీయ భద్రతను పటిష్టం చేయడం ఈ కమిటీ బాధ్యత. కృష్ణమూర్తి (45) ప్రస్తుతం ఇల్లినాయిస్‌ 8వ కాంగ్రెషనల్‌ జిల్లాకు ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కృష్ణమూర్తిని కమిటీలో సభ్యుడిగా నియమిస్తున్నట్లు సభాపతి న్యాన్సీ పెలోసీ బుధవారం ప్రకటించారు. కృష్ణమూర్తి ఢిల్లీలో ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయనకు మూడు మాసాల వయసున్నప్పుడే ఆయన కుటుంబం న్యూయార్క్‌లోని బఫెలో స్థిరపడింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా