ట్రంప్‌.. మళ్లీ కలుద్దాం: కిమ్‌

12 Sep, 2018 02:06 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ త్వరలో మరోసారి భేటీ అయ్యే అవకాశముందని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వెల్లడించింది. తనతో రెండోసారి భేటీ అవ్వాలని కోరుతూ ట్రంప్‌కు కిమ్‌ తాజాగా ఓ లేఖ రాశారని శ్వేతసౌధం పేర్కొంది. త్వరలో వీరిద్దరి భేటీకి వేదిక ఎంపిక తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారని వైట్‌హౌస్‌ తెలిపింది.

కొన్ని దశాబ్దాలుగా బద్దశత్రువులుగా ఉన్న అమెరికా, ఉత్తరకొరియాలు చర్చల బాట పట్టడం తెల్సిందే. ఇందులోభాగంగా గత జూన్‌లో సింగపూర్‌లో ట్రంప్, కిమ్‌ల మధ్య చారిత్రక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ‘కిమ్‌ నుంచి చాలా సానుకూలమైన లేఖ అందింది. ఉత్తర కొరియా అధినేత అనుమతి లేనిదే మేం లేఖలోని పూర్తి వివరాలను బహిర్గతం చేయలేం. మరో భేటీకి వేదిక, షెడ్యూల్‌ ఖరారు కోసమే కిమ్‌ ఆ లేఖ రాశారు. మేం ఆ పనుల్లోనే ఉన్నాం’ అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు