అఫ్గాన్‌ నుంచి సగం బలగాలు వెనక్కి

22 Dec, 2018 03:57 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనూహ్య నిర్ణయం

కాబూల్‌: ఆఫ్గానిస్తాన్‌లో తమ బలగాలను సగానికి తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించారు. ప్రస్తుతం 14వేల మంది సైనికులు ఆఫ్గాన్‌లో ఉండగా 7వేల మందిని వెనక్కి రప్పిస్తామన్నారు. అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని  పాకిస్తాన్‌లోని అజ్ఞాత ప్రదేశం నుంచి ఓ తాలిబన్‌ ప్రతినిధి ప్రకటించారు. అమెరికా భద్రతా బలగాలను ఉపసంహరించుకున్నా.. దేశ భద్రతపై ఎలాంటి ప్రభావం ఉండబోదని అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని అధికార ప్రతినిధి హరూన్‌ చఖన్సురి వెల్లడించారు. 

అమెరికా దౌత్యవేత్త ఖలిలాజ్‌ బుధవారం దుబాయ్‌లో తాలిబన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్లు ఆఫ్గానిస్తాన్‌ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలనే లక్ష్యంతో ఆయన తాలిబన్లను కలిశారు. ఇందులో భాగంగా విదేశీ బలగాలను పంపించడంతోపాటు జైల్లో ఉన్న తాలిబన్లందర్నీ విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. 2001లో 9/11 దాడులకు పాల్పడ్డ అల్‌ఖైదా∙అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌కు తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్గానిస్తాన్‌ ఆశ్రయమిచ్చింది. నాటి నుంచి సాగుతున్న ఈ సుదీర్ఘ యుద్ధంలో 2,200 మంది అమెరికా సైనికులు మరణించారు.

మరిన్ని వార్తలు