గోడకు నిధులిస్తే.. డ్రీమర్లకు గడువిస్తా

21 Jan, 2019 03:48 IST|Sakshi

డెమొక్రాట్లకు ట్రంప్‌ ప్రతిపాదన

ట్రంప్‌ ఆఫర్‌ను తిరస్కరించిన స్పీకర్‌ పెలోసీ  

వాషింగ్టన్‌: అమెరికాలో కొనసాగుతున్న షట్‌డౌన్‌కు ముగింపు పలికేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డెమొక్రాట్లు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలిపితే, దాదాపు 7 లక్షల మంది డ్రీమర్లకు(బాల్యంలోనే అమెరికాకు అక్రమంగా వచ్చినవారు) మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా కల్పిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. వైట్‌హౌస్‌ నుంచి శనివారం(స్థానిక కాలమానం) ప్రజలు, రాజకీయ నేతలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్‌.. ‘వాషింగ్టన్‌లోని రెండు పక్షాలు(రిపబ్లికన్లు, డెమొక్రాట్లు) ఓ అంగీకారానికి రావాల్సిన అవసరం ఉంది.

దేశంలోని 7,00,000 మంది డ్రీమర్లకు మరో మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా(టీపీఎస్‌) కల్పిస్తాం. స్వదేశాల్లో హింస, అంతర్యుద్ధం కారణంగా అమెరికాలో ఉంటున్న 3 లక్షల మంది విదేశీయులకు టీపీఎస్‌ను మూడేళ్ల పాటు పొడిగిస్తాం. ఇందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు.  అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ కోసం 5.7 బిలియన్‌ డాలర్లు(రూ.40,615 కోట్లు) ఇవ్వాలని ట్రంప్‌ కోరుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడి ప్రతిపాదన ఆచరణసాధ్యం కాదని డెమొక్రటిక్‌ నేత, ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని షట్‌డౌన్‌ చేయడాన్ని ట్రంప్‌ గర్వంగా భావిస్తున్నారనీ, దీనిని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు