కిమ్‌తో సత్సంబంధాలు.. ట్రంప్‌ స్పందన

15 Jan, 2018 11:09 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ చేసే వ్యాఖ్యలు ఎలాంటివైనా సరే అవి చర్చనీయాంశంగా మారిపోతున్నాయి. అయితే తాను మాట్లాడింది ఒకటైతే.. మీడియా మరొకటి ప్రచురించి తన కొంప ముంచుతున్నాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో తాను సత్సంబంధాలు ఉన్నాయన్న వార్తలను ఆయన ఖండిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. 

‘‘కిమ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని నేను చెప్పానట. కచ్చితంగా నేను అలా అనలేదు. అదృష్టవశాత్తూ నేను సదరు విలేకరితో మాట్లాడిన సంభాషణలను రికార్డు చేయించాను. నేను ఏం మాట్లాడానో, దాని అర్థమేంటో వారికి బాగా తెలుసు. వారికి కావాల్సింది ఓ స్టోరీ మాత్రమే... ఫేక్ న్యూస్’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ఈ మధ్య ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేయగా.. గత వారం ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో నార్త్ కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తో మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారని తెలిపింది. ఆ కథనాన్ని వైట్‌హౌజ్‌ ఖండించింది. చాలా అసత్యాలు ప్రచురించారని.. సరైన సమయంలో కిమ్ తో చర్చలు జరిపేందుకు కూడా తాను సిద్ధమని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారని వైట్‌హౌజ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు