గోడను అడ్డుకుంటే ఎమర్జెన్సీనే!

12 Jan, 2019 02:18 IST|Sakshi
రోనిల్‌ సోదరుడితో ట్రంప్‌ కరచాలనం

ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ట్రంప్‌ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ అనుమతి లేకుండానే ఇందుకు అవసరమైన నిధులు పొందడానికి జాతీయ అత్యవసర పరిస్థితి విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గోడ నిర్మాణానికి 5.6 బిలియన్‌ డాలర్లు మంజూరు చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం కోరగా డెమొక్రాట్లు అడ్డుపడిన సంగతి తెలిసిందే. గోడ నిర్మాణ ప్రణాళికలకు మద్దతు కూడగట్టేందుకు ట్రంప్‌ టెక్సస్‌లో పర్యటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించే అవకాశాలపై మీడియా ప్రశ్నించగా..ఆ దిశగా ఆలోచిస్తున్నామని సమాధానమిచ్చారు.

గోడకు రోనిల్‌ సోదరుడి మద్దతు..
ఇటీవల అక్రమ వలసదారుడి చేతిలో హత్యకు గురైన భారత సంతతి పోలీసు అధికారి రోనిల్‌ రాన్‌ సింగ్‌ సోదరుడు రెగ్గీ సింగ్‌..ట్రంప్‌ గోడ నిర్మాణ ప్రతిపాదనకు మద్దతిచ్చారు. తమ కుటుంబం మాదిరిగా ఇతరులు బాధపడకూడదంటే సరిహద్దును పటిష్టపరచాలని అన్నారు. టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రెగ్గీ సింగ్‌.. ట్రంప్‌ పక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. ‘నా సోదరునిలా మరో పోలీసు అధికారి బలికావొద్దు. ఈ ముప్పును తగ్గించడానికి ఏం చేయాలో చేయండి. మా కుటుంబం మద్దతుగా నిలుస్తుంది’ అని ట్రంప్‌తో రెగ్గీ అన్నారు.

మీడియానే ప్రతిపక్షం..
‘సరిహద్దుల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే డెమొక్రాట్లు వినడం లేదు. అక్కడ కృత్రిమ సంక్షోభం ఉందని కొత్తగా చెబుతున్నారు. నకిలీ మీడియా సంస్థల సృష్టే ఇది. వారు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నారు’ అని సరిహద్దు భద్రత, వలసలపై టెక్సాస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఆర్మీ డబ్బులతో గోడ నిర్మాణం?
ఆర్మీ కోర్‌ ఇంజినీర్ల విభాగంలో నిరుపయోగంగా ఉన్న నిధులతో గోడ నిర్మాణం చేపట్టాలని ట్రంప్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. గోడ నిర్మాణానికి కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? నిర్మాణం 45 రోజుల్లో ప్రారంభించొచ్చా? అనే విషయాలు తేల్చాలని ఆర్మీ కోర్‌ను ట్రంప్‌ ఆదేశించారు. మరోవైపు, కాంగ్రెస్‌ అనుమతి లేకుండానే నిధులు పొందేందుకు ట్రంప్‌ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ఏం చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు యోచిస్తున్నారు. ట్రంప్‌ ఎమర్జెన్సీ విధిస్తే ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి ఉన్న అవకాశాలను ప్రతిపక్ష డెమొక్రాటిక్‌ నాయకత్వం పరిశీలిస్తోంది.

మరిన్ని వార్తలు