‘అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్‌ రాజీనామా’..!!

17 Jan, 2019 15:22 IST|Sakshi

వాషింగ్టన్‌:  ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత తల దించుకొని వైట్‌హౌజ్‌ నుంచి ఇంటిదారి పట్టాడు. ప్రపంచం మొత్తం సంబరాలు చేసకుంటోంది’ అని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేరిట వెలువడిన ఓ ఫేక్‌ న్యూస్‌ సంచలనం రేకెత్తించింది. వాషింగ్టన్‌ డీసీలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యంలో ముంతెత్తింది. తాటి కాయంత అక్షరాలతో..  ‘ట్రంప్‌ రాజీనామా’ వార్త చూసి అక్కడి జనం షాక్‌కు గురయ్యారు. కొందరు నిజంగానే సంబరపడ్డారు. అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నుంచి బయటపడేందుకే ట్రంప్‌ రాజీనామా చేశాడంటూ ఆ ఫేక్‌ వార్తలో చెప్పుకొచ్చారు. లీసా చంగ్‌ ఈ ఫేక్‌ న్యూస్‌ను రచించగా.. క్రిస్టినైన్ ఫ్లెమింగ్‌ డిజైన్‌ చేశారు. ‘ది పబ్లిక్‌ సొసైటీ’ నుంచి ఈ పేపర్‌ పబ్లిష్‌ అయింది.

జరిగేది అదే..
వైట్‌హౌజ్‌ నుంచి తలదించుకొని వెళ్తున్న ట్రంప్‌.. 4 కాలమ్స్‌ ఫొటో పాఠకులను ఆకట్టుకుంది. అయితే, పేపర్‌పై పబ్లిషింగ్‌ తేదీ 2019, మే 1 అని ఉండడంతో అప్పటివరకు గందరగోళంలో పడిన పాఠకులకు కొంత క్లారిటీ వచ్చింది. మొత్తం వార్త చదవగా అది ఫేక్‌ న్యూస్‌ పేపర్‌ అని తెలిసింది. ‘30 ఏప్రిల్‌, 2019 న ట్రంప్‌ అధికారం నుంచి దిగిపోతాడు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ అధ్యక్షుడవుతాడు. జరిగేది ఇదే..! అందరిలా కాకుండా.. వినూత్నంగా.. వింతగా ఓ న్యాప్‌కిన్‌పై ఎర్ర సిరాతో తన ప్రత్యర్థులపై విమర్శలు రాసి పెట్టి పదవి నుంచి తప్పుకుంటాడు. అక్కడ నుంచి నేరుగా యాల్టా వెళ్తాడు’ అని సదరు ఫేక్‌ న్యూస్‌లో రాసుకొచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా మిత్ర దేశాల నాయకులు సమావేశమైన క్రిమియన్‌ హోటలే యాల్టా.

కాగా, సమాచారం అందుకున్న వాషింగ్టన్‌ పోస్ట్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్యతిరేకంగా వెలువడిన ఫేక్‌ న్యూస్‌ పేపర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ చర్యతో వారికి ఒరిగేమీలేదని ఫేక్‌ న్యూస్‌ పబ్లిషర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది. తమ పత్రిక గౌరవానికి భంగం కలిగించినందుకు సదరు పబ్లిషర్ పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేసింది. ఇలావుండగా, ‘ఇలాంటి పేపర్‌ మళ్లీ దొరకదు. వైట్‌ హౌజ్‌ దగ్గర ఉచితంగా ఈ పేపర్‌ ఇస్తున్నారు. వార్త బాగుంది’ అని ఓ నడివయసు మహిళ వ్యాఖ్యానించిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఫేక్‌ న్యూస్‌ పేపర్‌ పంచుతున్న ఓ మహిళ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

మరిన్ని వార్తలు