అమెరికా తరపునే మాట్లాడా : ట్రంప్‌

5 Dec, 2019 10:18 IST|Sakshi

న్యూయార్క్‌ : అభిశంసన విచారణ ప్రక్రియ సాగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విపక్షాల తీరును తప్పుపట్టారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం అధ్యక్ష పీఠాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ట్రంప్‌ ఎదురుదాడి ముమ్మరం చేశారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడుకి తాను ఫోన్‌ చేసిన క్రమంలో తమ దేశం గురించి ఉక్రెయిన్‌కు, ఉక్రెయిన్‌ గురించి అమెరికాకు అంతా తెలుసునంటూ మీరు మాకు సాయం చేయాలని కోరానని, ఇక్కడ మాకు అని అమెరికాను ఉద్దేశించి అన్నానని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

అమెరికా అటార్నీ జనరల్‌ మీకు లేదా మీ వాళ్లకు ఫోన్‌ చేస్తారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో అన్నానని వెల్లడించారు. ఈ మాటలపైనే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అమెరికన్లకు డెమోక్రాట్లు క్షమాపణ చెప్పాలని ట్రంప్‌ కోరారు. కాగా, ఉక్రెయిన్‌ కొత్త అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ట్రంప్‌ చేసిన ఫోన్‌ కాల్‌ కలకలం రేపడంతో అభిశంసన విచారణ ప్రధానంగా ఈ అంశం చుట్టూ సాగుతోంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ పార్టీ తరఫున తనకు ప్రధాన పోటీదారుగా నిలవనున్న జో బిడెన్‌కు ఉక్రెయిన్‌లో ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపి, తనకు సాయం చేయాలంటూ జెలెన్‌స్కీని కోరారన్నది ట్రంప్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు