‘పుట్టగానే పౌరసత్వం’ రద్దు!

23 Aug, 2019 04:42 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన

ఈ విధానం హాస్యాస్పదంగా మారిందని వెల్లడి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. అమెరికా భూభాగంపై చిన్నారులు పుట్టగానే పౌరసత్వం లభించేలా ఉన్న నిబంధనల్ని తొలగించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే అక్రమ వలసల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నామని వెల్లడించారు. దీంతో డెమొక్రాట్లు ట్రంప్‌ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వైట్‌హౌస్‌ దగ్గర బుధవారం ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ..‘అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి ప్రస్తుతం వెంటనే మన పౌరసత్వం లభిస్తోంది. ఈ నిబంధనల్ని తొలగించే విషయాన్ని మేం తీవ్రంగా పరిశీలిస్తున్నాం.

ప్రస్తుతమున్న ఈ వ్యవస్థ హాస్యాస్పదంగా తయారైంది’ అని వ్యాఖ్యానించారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్‌ స్పందిస్తూ.. ‘విదేశీయులు సరిగ్గా ప్రసవానికి ముందు సరిహద్దు దాటేసి అమెరికాలోకి వచ్చేస్తున్నారు. ఆ చిన్నారులు మన భూభాగంపై పుట్టగానే వారికి అమెరికా పౌరసత్వం లభిస్తోంది. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా, ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించిన భారత సంతతి డెమొక్రటిక్‌ నేత కమలా హ్యారిస్‌.. ట్రంప్‌ ముందుగా అమెరికా రాజ్యాంగాన్ని సీరియస్‌గా చదవాలని చురకలు అంటించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ శిశివులకు ‘పుట్టగానే పౌరసత్వం’ హక్కును కల్పిస్తోంది.  
 
వలసదారుల నిరవధిక నిర్బంధం
అమెరికాలోకి ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ప్రవేశించే వలసదారుల విషయంలో ట్రంప్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులు, వారి పిల్లలను నిరవధికంగా నిర్బంధించేలా కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం వలసదారుల పిల్లలను గరిష్టంగా 20 రోజుల పాటు మాత్రమే అదుపులో తీసుకునేందుకు వీలుండేది. తాజాగా ఈ నిబంధనల్ని సవరిస్తూ ట్రంప్‌ యంత్రాంగం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇది మరో 60 రోజుల్లో అమల్లోకి రానుంది.

ఈ విషయమై హోంల్యాండ్‌ విభాగం కార్యదర్శి కెవిన్‌ మెకలీనన్‌ మాట్లాడుతూ.. ‘మధ్య అమెరికా దేశాలకు చెందిన అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. అయితే ప్రస్తుత చట్టంలోని లోపాల కారణంగా 20 రోజుల తర్వాత వీరిని దేశంలోకి విడిచిపెట్టాల్సి వస్తోంది. ఈ కేసులు కోర్టుల్లో తేలడానికి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. దీన్ని మనుషుల అక్రమ రవాణా గ్రూపులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి’ అని తెలిపారు. కాగా, అమెరికాలోని చిన్నారులను కాపాడేందుకు, అక్రమ వలసల్ని నియంత్రించేందుకు ఇలాంటి లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు