భారత్‌లో అమెరికా కంటే ఎక్కువ కేసులు: ట్రంప్‌

6 Jun, 2020 15:58 IST|Sakshi

‘టెస్టులు పెరిగితే.. కేసులు పెరుగుతాయి’ 

వాషింగ్టన్‌: భారత్‌, చైనాలో విస్తృతంగా పరీక్షలు జరిపితే.. అమెరికాలో కన్నా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయట పడతాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. మెయిన్ న‌గ‌రం‌లో ఓ మెడిక‌ల్ ప్రోడ‌క్ట్స్ కంపెనీని సందర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అధికంగానే ఉంది. జాన్స్ హాప్కిన్స్ నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 1.9 మిలియన్ కరోనా కేసులు, 1,09,000 మరణాలు సంభవించాయి. మరోవైపు భారతదేశంలో 2,36,657 కరోనా కేసులు, 6,642 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ మొదట కనుగొనబడిన చైనాలో 84,177 కేసులు, 4,638 మరణాలు నమోదయ్యాయి.
(2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్‌)

ఈ క్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘మా దేశంలో 2 కోట్ల మందికి టెస్టులు చేశాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. టెస్టులు ఎక్కువ చేస్తే.. కేసులు పెరుగుతాయి. నా దేశ ప్రజలకు కూడా ఇదే చెప్పాను. ఒక వేళ మీరు గనక ఇండియా, చైనా వంటి ఇతర దేశాల్లో టెస్టులు విస్తృతంగా చేస్తే.. అక్కడ ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడతాయి అని నేను హామీ ఇస్తున్నాను’ అన్నారు. జర్మనీతో పోలిస్తే.. అమెరికాలోనే అత్యధికంగా టెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు. జ‌ర్మ‌నీలో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 40 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాలో 30 ల‌క్ష‌ల మందికి ప‌రీక్ష‌లు చేప‌ట్టారని తెలిపారు. అమెరికాలో ఈ సంఖ్య ఎక్కువన్నారు ట్రంప్‌. (‘వారి కోసం 5 వేల పడకలు సిద్ధం’)

మరిన్ని వార్తలు