మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి!

26 Jun, 2020 08:21 IST|Sakshi

వాషింగ్టన్‌ డీసీ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిగా విజయ్‌ శంకర్‌!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండో- అమెరికన్‌కు కీలక పదవి దక్కనుంది. భారత సంతతికి చెందిన విజయ్‌ శంకర్‌ను దేశ రాజధాని వాషింగ్టన్‌లోని అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నామినేట్‌ చేయాలనుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ట్రంప్‌ నిర్ణయానికి సెనేట్‌ ఆమోదం లభించిన పక్షంలో విజయ్‌ శంకర్‌.. వాషింగ్టన్‌ డీసీలోని డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ అసోసియేట్‌ జడ్జిగా సేవలు అందించనున్నారు. కాగా డ్యూక్‌ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందిన విజయ్‌ శంకర్‌.. యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జ్యూరిస్‌ డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు. అనంతరం అక్కడే వర్జీనియా లా రివ్యూ నోట్స్‌ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత యునైటెడ్‌ స్టేట్స్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ జడ్జి చెస్టెర్‌ జే. స్ట్రాబ్‌ వద్ద లా క్లర్క్‌గా ఉన్నారు.(అమెరికాలో తెలుగు జడ్జిమెంట్‌)

ఇక ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ క్రిమినల్‌ విభాగంలో సీనియర్‌ లిటిగేషన్‌ కౌన్సెల్‌గా ఉన్న విజయ్‌ శంకర్‌.. అప్పీలెట్‌ సెక్షన్‌ డిప్యూటీ చీఫ్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చేరడానికి ముందు వాషింగ్టన్‌లో ఆయన ప్రైవేటు లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. అంతర్జాతీయ స్థాయి లా కంపెనీలైన మేయర్‌ బ్రౌన్‌, ఎల్‌ఎల్‌సీ కోవింగ‍్టన్ అండ్‌ బర్లింగ్‌, ఎల్‌ఎల్‌పీలో పనిచేశారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డి.. యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జడ్జిగా నియమితులైన విషయం తెలిసిందే. సరిత తలిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల. వైద్యులైన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడగా.. సరిత అక్కడే పుట్టి పెరిగారు.  (న్యూయార్క్‌ జడ్జిగా సరితా కోమటిరెడ్డి..!)


సరితా కోమటిరెడ్డి

>
మరిన్ని వార్తలు