డ్రీమర్లకు ట్రంప్‌ ఊరట

26 Jan, 2018 01:52 IST|Sakshi

ఎలాంటి ఆందోళన వద్దన్న అమెరికా అధ్యక్షుడు

10, 12 ఏళ్లలో అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధం

వాషింగ్టన్‌: దాదాపు 7 లక్షల మంది స్వాప్నికుల్ని(డ్రీమర్లు) అమెరికా నుంచి పంపించేందుకు కంకణం కట్టుకున్న అధ్యక్షుడు ట్రంప్‌  మెత్తపడ్డారు. 10, 12 ఏళ్లలో డ్రీమర్లకు అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. చిన్న వయసులో తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లిన వీరిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ డ్రీమర్లుగా పిలుస్తున్నారు. ట్రంప్‌ తాజా నిర్ణయంతో వేలాది మంది భారతీయులకూ లబ్ధి చేకూరనుంది. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వీరి కోసం 2001లో పరస్పర అంగీకారంతో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ‘డ్రీమ్‌’ బిల్లును రూపొందించారు. కొన్ని నిబంధనలకు కట్టుబడి డ్రీమర్లకు పౌరసత్వం కల్పించడం దీని ఉద్దేశం. ఆ బిల్లు ఇంతవరకూ అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం పొందలేదు.  

ఆందోళన అవసరం లేదు: ట్రంప్‌
‘డ్రీమర్ల అంశంలో మార్పులకు సిద్ధంగా ఉన్నాం. 10, 12 ఏళ్లలో ఇది జరగవచ్చు’ అని ట్రంప్‌ చెప్పారు. వలసదారుల శ్రమకు ఇది ప్రోత్సాహకంగా ఆయన అభివర్ణించారు. ‘ఎలాంటి ఆందోళన అవసరం లేదని వారికి చెప్పండి’ అని డ్రీమర్లను ఉద్దేశించి  పేర్కొన్నారు. ఈ అంశంపై వైట్‌ హౌస్‌ సీనియర్‌ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఇంతవరకూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మించాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్‌.. దాని నిర్మాణానికి డెమొక్రాట్లు మద్దతివ్వకపోతే డ్రీమర్ల అంశంలో తాము మద్దతివ్వమని హెచ్చరించారు. ఆ గోడ పూర్తయితే అమెరికా పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం వస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు.  

సోమవారంలోగా వలసదారుల విధివిధానాలు ఖరారు
డ్రీమర్స్‌ భవితవ్యంపై ద్రవ్య వినిమయ బిల్లులో ఎలాంటి హామీ ఇవ్వకపోడంతో..  అమెరికా మూడు రోజుల పాటు స్తంభించిన సంగతి తెలిసిందే. ఆ అంశంపై చట్టం తెచ్చేందుకు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఒప్పందం కుదరడంతో షట్‌డౌన్‌కు తెరపడింది. అయితే ఫిబ్రవరి 8 వరకే నిధుల ఖర్చుకు కాంగ్రెస్‌ అనుమతించిన నేపథ్యంలో.. ఆ లోగా ట్రంప్‌ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ షట్‌డౌన్‌కు సిద్ధమని ప్రతిపక్షం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రకటన ప్రాధాన్యం సంతకరించుకుంది.

స్వాప్నికులంటే..
బాల్యంలో తల్లిదండ్రులతోపాటు అమెరికాలో చట్టవ్యతిరేకంగా ప్రవేశించిన వారినే స్వాప్నికులంటారు. వారిని దేశం నుంచి బలవంతంగా బయటకు పంపకుండా ప్రతి రెండేళ్లకు పనిచేయడానికి వర్క్‌ పర్మిట్‌తోపాటు నివసించేందుకు ‘డాకా’(డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌) సౌకర్యాన్ని కల్పించారు.  స్వాప్నికుల్లో అత్యధికశాతం దక్షిణ, మధ్య అమెరికా దేశాల నుంచి వచ్చినవారే.. డాకా కింద 5,500 మంది భారతీయులు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమం కింద లబ్ధిపొందే భారతీయ సంతతి ప్రజలు 17 వేల మంది ఉన్నారని అంచనా.

మరిన్ని వార్తలు