‘ఎంత తెలివితక్కువ ప్రశ్న ఇది?’

10 Nov, 2018 12:01 IST|Sakshi

వాషింగ్టన్‌ : మధ్యంతర ఎన్నికల్లో గట్టి షాక్‌ తిన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రెండు రోజుల క్రితమే సీఎన్‌ఎన్‌ జర్నలిస్ట్‌ జిమ్‌ అకోస్టా ప్రెస్‌పాస్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్‌ మరో సీఎన్‌ఎన్‌ జర్నలిస్ట్‌ని కూడా అవమానించారు. కొన్ని రోజుల క్రితమే ట్రంప్‌ అమెరికా అటార్ని జనరల్‌గా పనిచేస్తోన్న జెఫ్‌ సెషన్‌ని ఆకస్మాత్తుగా తొలగించి అతని స్థానంలో మాథ్యూ వైటకేర్‌ని నియమించారు. ఈ విషయంలో ట్రంప్‌ ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనకు మేలు చేసే వ్యక్తినే ఎన్నుకున్నారంటూ అమెరికన్లు ట్రంప్‌పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.

ప్రస్తుతం అమెరికా మీడియాలో కూడా ఇదే హట్‌ టాపిక్‌. ఈ విషయం గురించి అబ్బే ఫిలిప్‌ అనే సీఎన్‌ఎన్‌ జర్నలిస్ట్‌ ట్రంప్‌ని ప్రశ్నించారు. ‘కొత్తగా వచ్చిన ఈ అటార్ని జనరల్‌ ‘2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్ర’ గురించి నిజాయితీగా విచారణ చేస్తారా’ అంటూ ప్రశ్నించారు. అందుకు ట్రంప్‌ అతనిపై మండిపడుతూ.. ‘ఇది ఎంత తెలివితక్కువ ప్రశ్న.. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు చాలా తలతిక్క ప్రశ్నలు అడుగుతున్నావు’ అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం సీఎన్‌ఎన్‌ జర్నలిస్ట్‌పై నిషేదాన్ని సమర్థిస్తూ అతను చాలా అన్‌ప్రోఫెషనల్‌గా ప్రవర్తించాడని అందుకే ప్రెస్‌పాస్‌ని రద్దు చేసినట్లు తెలిపారు. అమెరికా అర్బన్‌కు చెందిన మరో రిపోర్టర్‌ ఏప్రిల్ ర్యాన్ని ఉద్దేశిస్తూ లూజర్‌.. చాలా రోతగా ఉంటాడంటూ విమర్శించారు.

మరిన్ని వార్తలు