సరిహద్దు గోడ నిర్మించి తీరతాను : ట్రంప్‌

6 Feb, 2019 11:23 IST|Sakshi

వాషింగ్టన్‌ : చట్టబద్దంగా వచ్చిన వారికే అమెరికాలో చోటు ఉంటుందని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన యూఎస్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమ దేశానికి వచ్చేవారు న్యాయపరంగా రావాలని ట్రంప్‌ కోరారు. అక్రమ వలసదారులే దేశానికి పెను ముప్పని తేల్చారు.

ఈ సందర్భంగా ట్రంప్‌ ‘అమెరికన్ల ఉద్యోగాలకు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ బలమైన వలస వ్యవస్థను రూపొందించడం మా నైతిక బాధ్యత. న్యాయపరంగా వచ్చే వలసదారులు మా దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. విదేశీయులు ఇంకా ఎక్కువ మంది మా దేశానికి రావాలని కోరుకుంటున్నాను. కానీ వారు న్యాయపరంగా రావాలి’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అక్రమ వలసల్ని, మాదక ద్రవ్యాలను అడ్డుకోవాలంటే సరిహద్దు గోడ నిర్మాణం తప్పనిసరని తేల్చారు. అమెరికా భద్రతకు అత్యంత కీలకంగా నిలిచే సరిహద్దు గోడ నిర్మాణాన్ని డెమోక్రాట్లు అడ్డుకోవడం సరికాదన్నారు ట్రంప్‌.

గతంలో చాలా మంది సరిహద్దు గోడ నిర్మణానికి మద్దతు తెలిపారని.. కానీ నేడు వ్యతిరేకిస్తున్నారని ట్రంప్‌ ఆరోపించారు. ఈ నెల 15 లోగా సరిహద్దు గోడ నిర్మాణం గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ గడువు విధించారు. చట్టబద్దంగా వచ్చిన వారికే అమెరికాలో చోటు ఉంటుందని తెలిపారు. అంతేకాక అదేసమయంలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించి డెమొక్రాట్లు చేస్తున్న విమర్శల విషయంలో  ఘాటుగా స్పందించారు. వాటిని పనికిమాలిన ఆరోపణలుగా కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు