టీ షర్ట్‌పై అసభ్య రాతలు.. తీవ్ర దుమారం

9 Dec, 2016 09:17 IST|Sakshi
టీ షర్ట్‌పై అసభ్య రాతలు.. తీవ్ర దుమారం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌పై వచ్చిన విమర్శలు ఎన్నో. వేర్పాటువాది, స్త్రీల పట్ల గౌరవం లేని వ్యక్తి అని ట్రంప్‌తో పాటు ఆయన సపోర్టర్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే.. అనూహ్యంగా ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించాడు. ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేని వర్గం ఫలితాల అనంతరం ఆందోళనలు సైతం నిర్వహించింది. కాగా.. ఇప్పుడు ట్రంప్‌ సపోర్టర్స్ టైం నడుస్తోంది. ట్రంప్ వ్యతిరేకులపై వారు తీవ్ర స్థాయి విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

ట్రంప్‌ మద్దతుదారులకు క్రిస్‌మస్‌ గిఫ్ట్‌గా సింగర్‌ కిడ్‌ రాక్‌ ఇటీవల కొత్త టీ షర్ట్‌ డిజైన్లను విడుదల చేశాడు. తన వెబ్‌సైట్‌ ద్వారా అమ్మకానికి ఉంచిన ఈ టీ షర్ట్లపై ఉన్న రాతలు.. ట్రంప్‌ వ్యతిరేకులపై అభ్యంతరకర రీతిలో దాడి చేస్తున్నాయి. దీంతో ట్రంప్‌ అభిమానుల్లో వీటికి యమా క‍్రేజ్‌ ఏర్పడింది. వీటిలో ఒక టీషర్ట్‌పై 'గాడ్‌, గన్స్‌, ట్రంప్‌' అని రాసి ఉండగా.. మరో దానిలో ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతు పలికిన ప్రాంతాలను కించపరిచేలా, ముస్లింలకు అనుకూలం అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు ఉన్నాయి. మూడో దానిలో మాత్రం.. డొనాల్డ్‌ ట్రంప్‌ స్పెల్లింగ్‌లోని మొదటి అక్షరాన్ని ఉద్దేశపూర్వకంగానే వదిలేసి.. అది ట్రంప్‌ హేటర్స్ నోట్లో ఉందంటూ అసభ్యకరంగా ఉంది.

ఒక్కో టీ షర్ట్‌ ధర 25 డాలర్లుగా నిర్ణయించినా.. విపరీతమైన డిమాండ్‌ ఉందని మురిసిపోతున్నాడు కిడ్‌ రాక్‌. ఈ టీ షర్ట్ లపై ట్రంప్ వ్యతిరేకుల నుంచే కాకుండా..డెమోక్రాట్లు ఆధిక్యం సాధించిన ప్రాంతంలో ఉన్న ట్రంప్‌ సపోర్టర్స్ నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరు వర్గాలు ఇక 'అసహనం' వదిలేయాలని సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.


 

మరిన్ని వార్తలు