వలసదారులపై మరో పిడుగు

6 Aug, 2017 00:59 IST|Sakshi
వలసదారులపై మరో పిడుగు

► అమెరికాలో తొలి ఐదేళ్లు సంక్షేమానికి ట్రంప్‌ చెక్‌
► ట్రంప్‌కు భారత రాఖీలు


వాషింగ్టన్‌: వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అమెరికాకు వచ్చే వలసదారులు తొలి ఐదేళ్లు సంక్షేమ పథకాల లబ్ధి పొందలేరని పేర్కొంటూ షాకిచ్చారు. గ్రీన్‌కార్డుల(శాశ్వత నివాస హోదా) జారీని తగ్గించే లక్ష్యంతో ప్రతిభ ఆధారిత వలస విధానానికి(రైజ్‌ చట్టం) మద్దతు తెలిపిన రెండ్రోజులకే తాజా నిర్ణయాన్ని ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా ప్రజల్ని ఉద్దేశించి వారాంతపు వెబ్, రేడియో ప్రసంగం చేస్తూ.. ‘మీరు మా దేశంలోకి వచ్చిన ఐదేళ్ల అనంతరం గానీ సంక్షేమ పథకాల్ని అందుకోలేరు. గతంలో లాగా  అమెరికాలో ప్రవేశించగానే ప్రయోజనాల్ని పొందడం ఇక నుంచి కుదరదు’ అని పేర్కొన్నారు.

అమెరికా కోసం ధైర్యంగా, సాహసోపేతమైన చర్యల్ని తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. అమెరికా సరైన మార్గంలో ప్రయాణిస్తోందని, ఈ ఏడాది మే నాటికి దేశంలో నిరుద్యోగ శాతం 16 ఏళ్ల కనిష్టానికి చేరిందని ప్రసంగంలో ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డుల జారీతో సంక్షేమ ప్రయోజనాల దుర్వినియోగం, అడ్డూఅదుపూ లేని వలసల్ని అడ్డుకోవడంతో పాటు, అమెరికన్‌ ఉద్యోగులకు మేలు జరుగుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు.

వైట్‌హౌస్‌కు 1001 రాఖీలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా హరియాణాలోని ట్రంప్‌ గ్రామం (అసలు పేరు మరోరా) నుంచి 1001 రాఖీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 1800 జనాభా ఉన్న ఈ గ్రామాన్ని సులభ్‌ ఇంటర్నేషనల్‌ దత్తత తీసుకుంది. గ్రామంలోని మహిళలు ట్రంప్‌ ముఖంతో రాఖీలు తయారుచేసి.. రక్షా బంధన్‌ నాటికి(ఆగస్టు 7) ట్రంప్‌కు చేరేలా అమెరికాకు పంపించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం కూడా 501 రాఖీలను తయారుచేశారు. తమ గ్రామంలో పర్యటించాలంటూ ఇద్దరు నేతలకు ఆహ్వాన పత్రాలు  కూడా పంపారు. ట్రంప్, మోదీలను పెద్దన్నలుగా భావిస్తున్నామని.. వారిద్దరూ తమ గ్రామానికి రావాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు. రాఖీ పండుగ రోజున ప్రధాని మోదీని కలవాలనేది తమ కోరికని ఆ గ్రామానికి చెందిన వితంతువులు పేర్కొన్నారు. మరోరా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సులభ్‌ ఇంటర్నేషనల్‌ చేపట్టింది.

మరిన్ని వార్తలు