తొందర్లోనే నీ పదవి ఊడిపోతుంది!

16 Jun, 2018 11:03 IST|Sakshi
జపాన్‌ ప్రధాని షింజో అబే- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

జపాన్‌ ప్రధాని షింజో అబేపై ట్రంప్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ : కెనడాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం సభ్య దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే జీ-7 సదస్సులో ప్రసంగిస్తూ సభ్యదేశాలు, అధినేతల గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఉగ్రవాదం, వలసదారులను ఉద్దేశించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు, సదస్సులో ఆయన ప్రవర్తించిన తీరు తోటి సభ్యులకు చిరాకు తెప్పించిందని యూరోపియన్‌ యూనియన్‌ అధికారి తెలిపినట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమంటూ వ్యాఖ్యానించిన ట్రంప్‌.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ఇమాన్యుయల్‌ను ఉద్దేశించి ఉగ్రవాదులంతా ప్యారిస్‌లోనే ఉన్నారన్నారు. వలసదారుల వల్ల స్థానికులకు కలుగుతున్న నష్టాల గురించి ప్రస్తావిస్తూ.. యూరోప్‌లో వలసదారులు ఎక్కువయ్యారని పేర్కొన్నారు. ‘ఈ విషయంలో జపాన్‌ ప్రధాని షింజో అబేకు అసలు ఏ సమస్యా లేదు. కానీ నేను తలచుకుంటే 25 మిలియన్‌ మంది మెక్సికన్‌లను జపాన్‌కు పంపించగలను. అదే జరిగితే తొందర్లోనే నీ పదవి ఊడిపోతుందంటూ’  ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

అయితే ఈ కథనాలపై స్పందించిన ట్రంప్‌.. మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని.. జీ-7 దేశాధినేతలతో తనకు సత్సంబంధాలే ఉన్నాయంటూ వరుస ట్వీట్లతో అమెరికన్‌ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా