భారత్‌ సహాయాన్ని కోరిన ట్రంప్‌

5 Apr, 2020 10:22 IST|Sakshi

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌ విజృంభణతో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది.  లక్షలాది మంది వైరస్‌ బారిన పడగా.. వేలాది మంది మృత్యువాత పడ్డారు. సామాన్యులే కాక  ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు అంటే వైరస్‌ తీవ్రత ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా కోరల్లో నుంచి తప్పించుకునేందుకు ట్రంప్‌ భారత సహాయాన్ని కోరారు. మలేరియా నిరోధానికి వాడే హైడ్రా​క్సీ ‍ క్లోరోక్వీన్‌ మెడిసిన్‌ను తమ దేశానికి ఎగుమతి చేయాలని ట్రంప్‌ భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. (వాషింగ్టన్‌లో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌)


కోవిడ్-19 బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు మలేరియా నియంత్రణకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను మరింత విరివిగా సరఫరా చేయాలని ప్రధాని మోదీని ట్రంప్ కోరారు. ఈ మేరకు శనివారం మోదీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను యూఎస్ కు పెద్దఎత్తున సరఫరా చేసేందుకు భారత్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతిపై ఇప్పటివరకు ఉన్న నిషేదాన్ని తొలగించాలని భావిస్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో మోదీని హైడ్రాక్వీ క్లోరోక్విన్ టాబ్లెట్ల సరఫర చేయమని విజ్ఞప్తి చేశాను’ అని  ట్రంప్ పేర్కొన్నారు. (ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ)

ఈ మెడిసిన్‌ కోసం అమెరికా ఇప్పటికే భారత్‌కు ఆర్డర్ అందించిందని, అయితే, ప్రస్తుతం భారత నిషేధం అమలులో ఉన్నందున ఇంకా సరఫరా జరగలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగం‍గా శనివారం వైట్‌హౌస్‌లో యూఎస్‌ అధికారులతో సమీక్ష చేపట్టిన ట్రంప్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం అభినందనీయమన్నారు. కాగా ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహ్మమారిని తరిమికొట్టేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటామని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు