త్వరలో శుభవార్త అందించబోతున్నాం

14 Jul, 2020 09:19 IST|Sakshi

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌ ఉదృతికి అమెరికా అల్లాడుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు సంభవిస్తూ.. అగ్రరాజ్యంలోని ప్రజల మనుగడను ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా, భారత్‌, బ్రెజిల్‌ వంటి పెద్ద దేశాల కంటే అమెరికాలో ప్రపంచంలోనే  అతిపెద్ద కోవిడ్‌-19 పరీక్షా సామర్థ్య కార్యక్రమం ఉందని అన్నారు. అంతేగాక అమెరికాలో అత్యల్ప మరణాల రేటు మాత్రమే ఉందని వైట్‌హౌజ్‌లో జరిగిన సమావేశంలో చెప్పారు. కాగా అమెరికాలో ఇప్పటి వరకు 34 లక్షల మంది కరోనా బారిన పడగా, ఈ మహమ్మారి కారణంగా 1,37,000 మంది మరణించారు. కేసులలోనూ, మరణాలలోనూ అమెరికానే మొదటి స్థానంలో ఉంది. (‘ఈ వివాదంలో అమెరికా జోక్యం అనవసరం’)

ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే తమ పరిపాలన విభాగం భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం వల్ల అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తాయని అన్నారు. ‘మేము ఇప్పటి వరకు 45 మిలియన్ల పరీక్షలు నిర్వహించాము. కాబట్టి ఎక్కువ కేసులు వచ్చాయి. కొన్ని దేశాల్లో కేవలం ఆస్పత్రికి వచ్చిన వారికి, అనారోగ్యంగా ఉన్న వారికే పరీక్షలు చేస్తున్నాయి. అందుకే అక్కడ ఎక్కువ కేసులు లేవు. అయితే మనకు కేసుల ప్రభావం ఎక్కువ ఉన్నందున కత్తి మీద సాములా తయారయ్యింది’. అని పేర్కొన్నాడు. అలాగే యూఎస్‌లో అత్యల్ప మరణాల రేటు ఉందని ట్రంప్‌ అన్నారు. ‘మేము కరోనాకు వ్యతిరేకంగా గొప్పగా పనిచేస్తున్నాము. వ్యాక్సిన్‌ల వాడకం చాలా బాగా పనిచేస్తోంది. దీంతో చికిత్సా విధానంలో మంచి మార్పులు రాబోతున్నాయని ఆశిస్తున్నాను. త్వరలో మంచి వార్తను అందించబోతున్నాం’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. (మొదటిసారిగా మాస్క్‌తో ట్రంప్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు