మిలటరీని దింపుతా: ట్రంప్‌ 

3 Jun, 2020 03:27 IST|Sakshi
కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో వేలాది మంది నిరసనకారుల ర్యాలీ 

వాషింగ్టన్‌: జార్జ్‌ఫ్లాయిడ్‌ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు ఈ ఉద్యమాలను అణచివేయడంలో విఫలమైతే సైన్యాన్ని రంగంలోకి దింపేందుకూ వెనుకాడనని అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. మరోవైపు భారతీయ అమెరికన్‌ సీఈవోలు పలువురు ఆందోళనలకు మద్దతు పలికారు. వైట్‌హౌస్‌లోని రోజ్‌ గార్డెన్‌లో సోమవారం ట్రంప్‌ ప్రసంగిస్తూ..ఆందోళనలను, దుకాణాల లూటీ, విధ్వంసకర చర్యలను అదుపు చేసేందుకు సాయుధులైన వేలాది మంది సైనికులు, మిలటరీ అధికారులను పంపుతున్నట్లు ప్రకటించారు.

‘‘హింసాత్మక ఘటనలు తగ్గేంతవరకూ ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు తగినంత మంది నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ను విధుల్లో నియమించాలి. చట్టాలు అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలి’’అని స్పష్టం చేశారు. ఏదైనా రాష్ట్రం, నగరంతగిన చర్యలు తీసుకోలేని పక్షంలో సమస్యలు పరిష్కరించేందుకు అక్కడ అమెరికా మిలటరీని నియమిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికా ఇటీవలి కాలంలో నేరస్తులు, దుండగులు, విధ్వంసకారుల చేతుల్లో బందీ అయిపోయిందని ఇది స్థానిక ఉగ్రవాదమేనని, అమాయకుల ప్రాణాలు తీయడం మానవజాతిపై మాత్రమే కాకుండా దేవుడికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలని అన్నారు.
వైట్‌హౌస్‌ ప్రాంగణంలో సైనిక వాహనాలు..

ఇదిలా ఉండగా.. ఫ్లాయిడ్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. గొంతు నొక్కుకుపోయిన కారణంగా అతడి మరణం సంభవించిందని ఇది హత్యేనని అధికారికంగా ప్రకటించారు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసగా మొదలైన నిరసనలు సోమవారం కూడా కొనసాగాయి. ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆరు రాష్ట్రాలతోపాటు 13 నగరాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. నేషనల్‌ సెక్యురిటీ గార్డ్స్‌కు చెందిన  67 వేల మంది పలు నగరాల్లో పరిస్థితిని నియంత్రించే ప్రయత్నాల్లో ఉన్నారు.

చర్చిని సందర్శించిన ట్రంప్‌... 
వాషింగ్టన్‌లో ఆందోళనకారుల చేతుల్లో పాక్షికంగా దహనమైన సెయింట్‌ జాన్స్‌ చర్చ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం సందర్శించారు. చేతిలో బైబిల్‌ పట్టుకున్న ట్రంప్‌ చర్చిలో కొంత సేపు గడిపారు. అధ్యక్షుల చర్చిగా పేర్కొనే సెయింట్‌ జాన్స్‌ ఎపిస్కాపల్‌ చర్చ్‌లో తొలి ప్రార్థనలు 1816 అక్టోబరు 27న జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వైట్‌హౌస్‌కు దగ్గరగా ఉంటుంది ఈ చర్చి. జేమ్స్‌ మాడిసన్‌ మొదలుకొని  అధ్యక్షులంతా ఈ చర్చిలో ప్రార్థనలు చేసిన వారే.

సత్య నాదెళ్ల మద్దతు

జార్జ్‌ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలకు మైక్రోసాప్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌  మద్దతు పలికారు. ‘సమాజంలో హింసకు, ద్వేషానికి తావులేదు. సానుభూతి, అర్థం చేసుకోవడం అవసరం. అయితే వీటికంటే ఎక్కువ చేయాల్సి ఉంది’అని సత్య నాదెళ్ల  ట్వీట్‌ చేశారు. ఆఫ్రికన్‌ అమెరికన్లకు మద్దతు తెలుపుతున్నానని, తమ కంపెనీలోనూ, సమూహాల్లోనూ ఇదే పంథా అనుసరిస్తామన్నారు. సుందర్‌ పిచాయ్‌ ఒక ట్వీట్‌ చేస్తూ.. ‘‘ఈ రోజు అమెరికాలోని గూగుల్, యూట్యూబ్‌ హోం పేజీల్లో ఆఫ్రికన్‌ అమెరికన్లకు సంఘీభావం తెలుపుతా’’అని చెప్పారు.  పెప్సీ కో మాజీ సీఈవో ఇంద్రా నూయీ కూడా ఆందోళన చేస్తున్న వారికి మద్దతు పలికారు. వారం రోజులుగా లక్షలాది మంది అమెరికన్లు తమ బాధను నిరసన ప్రదర్శనల రూపంలో వ్యక్తం చేశారని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు