ఇరాన్‌ నిప్పుతో చెలగాటమాడుతోంది: ట్రంప్‌

3 Jul, 2019 03:58 IST|Sakshi

వాషింగ్టన్‌: 2015 నాటి అణు ఒప్పందం లోని నిబంధనలను ఉల్లంఘించి యురేనియం నిల్వలను అనుమతించిన స్థాయికి మించి పెంచి ఇరాన్‌ నిప్పుతో చెలగాటమాడుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. యురేనియం నిల్వలను పెంచుకోవడాన్ని ఆపాలంటూ అమెరికా విదేశాంగ మంత్రి గట్టిగా చెప్పిన నేపథ్యంలో ట్రంప్‌ ఇరాన్‌కు హెచ్చరికలు చేశారు. అణు ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్‌ తొలిసారిగా గత సోమవారం ఉల్లంఘించింది. ‘ఇరాన్‌ నిప్పుతో చెలగాటమాడుతోంది. నేను కొత్తగా ఇరాన్‌కు చెప్పదలచుకున్నది ఏదీ లేదు.

అయితే తాము నిప్పుతో ఆడుకుంటున్నామన్న విషయాన్ని ఇరాన్‌ గుర్తెరగాలి’ అని ట్రంప్‌ శ్వేతసౌధంలో మీడియాతో అన్నారు. అనంతరం శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘యూరేనియంను చిన్న మొత్తంలో నిల్వ చేసుకునేలా అణు ఒప్పందంలో ఇరాన్‌కు అవకాశం కల్పించడమే తప్పు. అసలు ఏ స్థాయిలోనూ యురేనియం నిల్వలను కలిగి ఉండేందుకు ఇరాన్‌ను అనుమతించి ఉండాల్సింది కాదు. ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేసేందుకు అమెరికాతోపాటు మా మిత్రదేశాలు కూడా ఎప్పటికీ అనుమతించవు’ అని అన్నారు. అణు ఒప్పందం ప్రకారం 300 కేజీల వరకు యురేనియంను నిల్వచేయొచ్చు.

మరిన్ని వార్తలు