ఇరాన్‌కు ట్రంప్‌ మరో హెచ్చరిక

13 Jan, 2020 04:51 IST|Sakshi

వాషింగ్టన్‌: ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనలపై హింసాత్మక చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌ విమానాన్ని గత బుధవారం పొరపాటున కూల్చేశామని ఇరాన్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ ప్రమాద మృతులకు నివాళిగా టెహ్రాన్‌లోని ఆమిర్‌ కబీర్‌ వర్సిటీలో శనివారం ఒక కార్యక్రమం చేపట్టారు. అందులో పాల్గొ న్న ఇరాన్‌లోని బ్రిటన్‌ రాయబారి రాబ్‌ మెకెయిర్‌ని అధికారులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బ్రిటన్‌ మండిపడింది. ఆమిర్‌ కబీర్‌ యూనివర్సిటీలో జరిగిన నిరసనల్లో విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారని, ఇటీవల అమెరికా దాడిలో చనిపోయిన జనరల్‌ సులైమానీ పోస్టర్లను చింపేశారని ఇరా న్‌ మీడియా తెలిపింది. మరోవైపు, ఆందోళనలను అణచేయడంపై ట్రంప్‌ పలు ట్వీట్లు చేశారు.

గత నవంబర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం మోపడాన్ని ట్రంప్‌ ప్రస్తావిస్తూ ‘శాంతియుత నిరసనకారులపై మరో ఊచకోత జరగకూడదు. ఇంటర్నెట్‌పై ఆంక్షలను సహించం. ఇరాన్‌ ప్రజలారా! మీకు నా సహకారం కొనసాగుతుంది’ అన్నారు. ఆందోళనలు తలెత్తే అవకాశమున్న ప్రాంతాల్లో ఇరాన్‌  బలగాలను మోహరించింది. కాగా ఉక్రెయిన్‌ విమాన ప్రమాదానికి తమదే  బాధ్యతని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది. ఆ విమానాన్ని క్షిపణిగా భావించడంతో తమ మిస్సైల్‌ ఆపరేటర్‌ సొంతంగా నిర్ణయం తీసుకుని  కూల్చేశాడని పేర్కొంది. సమాచార వ్యవస్థలో 10 సెకండ్ల పాటు అడ్డంకి ఏర్పడటంతో ఉన్నతాధికా రుల నుంచి ఆ ఆపరేటర్‌ ఆదేశాలు తీసుకోలేకపోయాడని, సొంతంగా నిర్ణయం తీసుకుని ఆ పొరపాటు చేశాడని వివరించారు.

మరిన్ని వార్తలు