గెట్ రెడీ రష్యా: ట్రంప్‌ తాజా వార్నింగ్‌

11 Apr, 2018 19:17 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (ఫైల్‌ ఫోటో)

వాషింగ్టన్‌: అమెరికా రష్యా మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకంపనలు పుట్టించారు. తన చిరకాల ప్రత్యర్థి రష్యాపై మరోసారి కయ్యానికి కాలు దువ్వుతూ సోషల్‌ మీడియాలో స్పందించారు. సిరియాకు వ్యతిరేకంగా రష్యాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసి దుమారాన్నే లేపారు. ప్రజల్ని చంపి, పైశాచికానందాన్ని పొందుతున‍్న సిరియాకు మద్దతుగా నిలవొద్దు. సిరియాపై క్షిపణి దాడులకు  సిద్ధంగా ఉండాలంటూ రష్యానుద్దేశించి ట్రంప్ ట్వీట్ చేశారు. వరుస ట్వీట్లలో ఆయన రష్యాపై తన దాడిని ఎక్కుపెట్టారు. రష్యాతో అమెరికా  సంబంధాలు ఇంతకుముందెన్నడూ లేనంత అధ్వాన్నంగా  ఉన్నాయి. ఇది  ప్రచ్ఛన్నయుద్ధానికి దారి తీయనుంది. పరస్పర సహకారం అవసరం. ఇది చాలా సులభం. దీనికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలి. ఆయుధ పోటీని ఆపాలా? అంటూ ఆయన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.  డమాస్కస్ సమీపంలో జరిగిన రసాయన దాడికి ప్రతిస్పందనగా  ఆయన ఇలా స్పందించినట్టు తెలుస్తోంది.

గ్యాస్‌తో ప్రాణాలు తీస్తున్న క్రూరమైన జంతువుకు రష్యా మద్దతు ఇవ్వడం అభ్యంతరకమని డోనాల్డ్ ట్రంప్ రష్యాను  తీవ్ర స్థాయిలో మందలించారు. ఒక వేళ మీరు తమతో తలపడాలని చూస్తే నూతన, శక్తివంతమైన, స్మార్ట్ మిస్సైల్స్ మీకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ మధ్య సిరియాలో జరుగుతున్న మారణకాండకు రష్యా పరోక్ష మద్దతునివ్వడంతో పాటు ఇలాంటి చర్యలను అణచివేస్తామని చెప్పిన అమెరికాపై కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తాజాగా రష్యాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే  ప్రమాదం పొంచి వుంది.  ట్రంప్ ట్వీట్లపై రష్యా ఎలా స్పందిస్తుంది, తర్వాత ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరిన్ని వార్తలు