గోడలో పాములు, మొసళ్లు ఉంచండి: ట్రంప్‌

2 Oct, 2019 19:18 IST|Sakshi

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసదారులపై మరోసారి విరుచుకుపడ్డారు. వలసదారులను అడ్డుకోవడానికి కరెంటు తీగలతో కూడిన గోడను నిర్మించి.. దాని పొడవునా పాములు, మొసళ్లు ఉండేలా చూడాలని వైట్‌హౌజ్‌ సలహాదారులకు సూచించారు. తద్వారా వలసదారులను అడ్డకోవచ్చని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ట్రంప్‌ వలసదారులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ట్రంప్‌ ప్రవేశపెట్టిన జీరో టాలరెన్స్‌ విధానం కారణంగా అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విధానం వల్ల ఎంతో మంది వలస చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరం కాగా.. మరికొంత మంది అమెరికాలో ప్రవేశించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో వలసదారుల పట్ల కాస్త మెతక వైఖరి ప్రదర్శిస్తామన్నట్లు సంకేతాలు ఇచ్చిన ట్రంప్‌ మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. నేటికీ వలసదారులు అక్రమంగా అమెరికాలో ప్రవేశిస్తున్నారంటూ ఉన్నతాధికారులపై ట్రంప్‌ విరుచుకుపడినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. సరిహద్దు గోడ విషయంలో అలసట వహిస్తూ తనను ఇడియట్‌లా మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ వారిపై చిందులు తొక్కినట్లు తెలిపింది. కాగా సరిహద్దు సమస్యల నేపథ్యంలో.. మైకెల్‌ షియర్‌, జూలీ డెవిస్‌ అనే ఇద్దరు వ్యక్తులు సంయుక్తంగా రచించిన ‘బార్డర్‌ వార్స్‌: వలసదారులపై ట్రంప్‌ అంతరంగం’ అనే పుస్తకం ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఈ పుస్తకాన్ని అక్టోబర్‌ 8న ఆవిష్కరించనున్నారు.

>
మరిన్ని వార్తలు