దించేస్తారా?

19 May, 2017 01:00 IST|Sakshi
దించేస్తారా?

► దించే దాకా వెళతారా?
► ట్రంప్‌పై అభిశంసన తీర్మానం పెట్టాల్సిందేనని డిమాండ్లు


అత్యంత రహస్యమైన నిఘా సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు చెప్పేసి... ఇరకాటంలో పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం పెట్టాల్సిందేననే డిమాండ్లు డెమొక్రాట్ల నుంచి వినపడుతున్నాయి. ప్రతినిధుల సభ, సెనెట్‌.. రెండింటిలోనూ రిపబ్లికన్‌ పార్టీకే (ట్రంప్‌ పార్టీ) మెజారిటీ ఉంది. కాబట్టి అభిశంసన తీర్మానం నెగ్గడం అంత సులభం కాదు. అయితే ప్రజాభిప్రాయం కూడా వేగంగా ట్రంప్‌నకు వ్యతిరేకంగా మారుతోంది. ప్రైవేటు సంస్థ ‘పబ్లిక్‌ పాలసీ పోలింగ్‌ (పీపీపీ)’మంగళవారం విడుదల చేసిన సర్వేలో... ఏకంగా 48 శాతం మంది ట్రంప్‌ను అభిశంసించాల్సిదేనన్నారు.

అభిశంసనకు వ్యతిరేకమన్న వారు 41 శాతం. ట్రంప్‌ బృందం పనితీరు బాగుందన్న వారు 40 శాతమే కాగా, పాలనపై పెదవి విరిచిన వారు ఏకంగా 54 శాతం మంది ఉండటం గమనార్హం. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీని అర్ధంతరంగా పదవి నుంచి తొలగించాక జరిగిన సర్వే ఇది. ఈ నెల 12 నుంచి 14 మధ్య జరిగింది. సర్వే జరిగాక ట్రంప్‌ తప్పులు మరో రెండు బయటకు వచ్చాయి. ఒకటి చిరకాల ప్రత్యర్థి రష్యాతో నిఘా సమాచారాన్ని పంచుకోవడం, రెండోది... మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్‌ ఫ్లిన్‌పై విచారణను ఆపేయాల్సిందిగా ట్రంప్‌ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కోమీని కోరినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక బయటపెట్టింది.

తాజా పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొంటే ప్రజాభిప్రాయంలో మరింతగా తేడా రావొచ్చు. ప్రజా వ్యతిరేకత ఇంకా పెరిగితే రిపబ్లికన్‌ పార్టీ చట్టసభ సభ్యులు కూడా ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికే పరిస్థితులు తలెత్తవచ్చు. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేం గాని... ఒకవేళ ట్రంప్‌ను దించేదాకా పరిస్థితి వస్తే... ఆయనపై మోపే అభియోగాలేమిటి, అభిశంసన ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇతర మార్గాలేమిటనేది చూద్దాం...

అభియోగాలు...
న్యాయ ప్రక్రియకు అడ్డు తగలటం
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ బృందం రష్యాతో... ముఖ్యంగా అమెరికాలో ఆ దేశ రాయబారి సెర్గీ కిస్లయాక్‌తో సంబంధాలు నెరిపిందనే ఆరోపణలు ఉన్నాయి. హిల్లరీ, ఇతర డెమొక్రాటిక్‌ నేతల ఈ మెయిల్స్‌ను లీక్‌ చేయడం ద్వారా రష్యా పరోక్షంగా ట్రంప్‌ విజయానికి దోహదపడిందని ఆరోపణ.పుతిన్‌తో కలిసి పనిచేస్తానని ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్‌ పలుమార్లు చెప్పడం... వీరిమధ్య ఏదో ఉందనే అనుమానాలకు తావిచ్చింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా ప్రభావం మీద విచారణ కోసం ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ రాబర్ట్‌ ముల్లర్‌ను ప్రత్యేక కౌన్సిల్‌గా నియమించారు. దీన్ని మొదట స్వాగతించిన ట్రంప్‌... తరువాత గురువారం వేకువజామున ఇది అత్యంత ప్రతీకారేచ్ఛ చర్యని ట్వీట్‌ చేశారు. దీన్నిబట్టి ట్రంప్‌ బృందం ఆందోళనకు గురవుతుందనేది అర్థమవుతుంది. రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్‌తో తను సంభాషించిన విషయాలపై ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను తప్పుదోవ పట్టించినందుకు జాతీయ భద్రతా సలహాదారు మైకేల్‌ ఫ్లిన్‌ నెలరోజుల్లోనే (ఫిబ్రవరి 13న) పదవికి రాజీనామా చేశారు. రష్యాతో ఫ్లిన్‌కు గల సంబంధాలపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) విచారణ జరుపుతోంది. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేసిందనే ఆరోపణలపైనా విచారణ జరుగుతోంది.

ఈ తరుణంలో అకస్మాత్తుగా ఈ నెల 9న ఎఫ్‌బీఐ డైరక్టర్‌ జేమ్స్‌ కోమీని పదవి నుంచి తప్పించారు ట్రంప్‌. పైగా ఒక ఇంటర్వ్యూ లో ఈ నిర్ణయం తీసుకునేటపుడు రష్యా వ్యవహారం కూడా తన మదిలో ఉందని ట్రంప్‌ స్వయంగా చెప్పారు. అంతకుముందే ఫ్లిన్‌పై విచారణను నిలిపివేయాల్సిందిగా కోమీని ట్రంప్‌ కోరినట్లు మంగళవారం బయటపడింది. ఈ రెండు సందర్భాల్లోనూ అధ్యక్షుడు పరిధిని దాటి న్యాయ ప్రక్రియకు అడ్డు తగిలినట్లేనని కొందరు నిపుణుల విశ్లేషణ. ‘తీవ్ర నేరాలు, ఇతర స్వల్పకాలిక శిక్షార్హమైన నేరాలు’చేస్తే అధ్యక్షుడిని అభిశంసించవచ్చని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. న్యాయ ప్రక్రియకు అడ్డు తగలడం దీని కిందకే వస్తుందని వీరి వాదన.

ప్రమాణాన్ని ఉల్లంఘించడం
మిత్ర దేశం అందించిన అత్యంత రహస్య నిఘా సమాచారాన్ని ట్రంప్‌ రష్యాతో పంచుకున్నాడనేది వాషింగ్టన్‌ పోస్ట్‌ బయటపెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. అధ్యక్షుడిగా ఆ మేరకు తనకు సంపూర్ణ అధికారం ఉందని ట్రంప్‌ సమర్థించుకున్నారు. నిజమే... రాజ్యాంగం ప్రకారం అమెరికా అధ్యక్షుడు తన విచక్షణ మేరకు ఎంత గోప్యమైన సమాచారాన్నైనా ఎవరితోనైనా పంచుకోవచ్చు. అది చట్ట ఉల్లంఘన కిందకు రాదు.

అయితే దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు... ‘అమెరికా అధ్యక్ష బాధ్యతలను పూర్తి నిష్ఠతో నిర్వర్తిస్తానని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను’అని ప్రమాణం చేస్తారు. ప్రత్యర్థి దేశమైన రష్యాకు కీలక నిఘా సమాచారాన్ని నిర్లక్ష్యంగా వెల్లడిం చడం కూడా నిష్ఠతో బాధ్యతల నిర్వహణ కిందకు వస్తుందని సమర్థించుకోవడం సాధ్యం కాదని లాఫేర్‌ అనే న్యాయనిపుణుల బ్లాగ్‌లోని ఆరుగురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అంటే... ప్రమాణాన్ని ట్రంప్‌ ఉల్లంఘించినట్లేనని వీరి ఉద్దేశం.

అభిశంసన ప్రక్రియ...
ఎలా మొదలవుతుందంటే: అమెరికాలో అభిశంసన ప్రక్రియను మొదలుపెట్టే అధికారం ప్రతి నిధుల సభకు మాత్రమే ఉంది. న్యాయ శాఖ, స్వయంగా ప్రతినిధుల సభ, ప్రత్యేకంగా నియమించిన న్యాయవాది... వీరిలో ఎవరో ఒకరు మొదట స్వతంత్ర విచారణ జరుపుతారు. అభియోగాలకు గల ఆధారాలను హౌస్‌ జ్యుడీషియరీ కమిటీకి సమర్పిస్తారు. ఈ కమిటీ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి అభిశంసన తీర్మానానికి ఆర్టికల్స్‌ను రాస్తుంది. దీనిపై చర్చ జరిగాక ఓటింగ్‌ చేపడతారు. ప్రతినిధుల సభలో సాధారణ మెజారిటీతో నెగ్గితే అధ్యక్షుడు అభిశంసనకు గురైనట్లే. అంతమాత్రాన పదవి పోదు. తదుపరి ఇది సెనేట్‌కు చేరుతుంది.

అసలు ఘట్టం: అభిశంసన తీర్మానం సేనేట్‌కు చేరాక విచారణ మొదలవుతుంది. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జడ్జిగా, సెనెట్‌ జ్యూరీగా విచారణ జరుగుతుంది. అధ్యక్షుడు తన వాదనలు వినిపించుకోవచ్చు. హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ ప్రాసిక్యూషన్‌గా వ్యవహరిస్తుంది. సెనేట్‌లో మూడింట రెండొంతుల మంది సభ్యులు (67 మంది, మొత్తం సెనెట్‌ బలం 100) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటేస్తే పదవి ఊడుతుంది.

బలాబలాలు: ప్రతినిధుల సభలో సాధారణ మెజారిటీ వస్తే అభిశంసన తీర్మానం ఆమోదం పొందినట్లే. 435 మంది సభ్యులుండే ప్రతినిధుల సభలో 4 ఖాళీలున్నాయి. రిపబ్లికన్‌ల బలం 238 కాగా, డెమొక్రాట్ల బలం 193. సాధారణ మెజారిటీకి 216 ఓట్లు వస్తే చాలు. అంటే డెమొక్రాట్లు  ట్రంప్‌పై అభిశంసన పెడితే అది నెగ్గడానికి... కనీసం 23 మంది రిపబ్లికన్ల మద్దతును కూడగట్టాలి. సెనేట్‌ విషయానికి వస్తే 100 మంది సభ్యుల్లో రిపబ్లికన్‌లు 52, డెమొక్రాట్లు 46, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. అభిశంసన నెగ్గాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. 67 ఓట్లు కావాలి. అంటే డెమొక్రాట్లు మరో 21 మంది మద్దతు సంపాదించాలి.

ట్రంప్‌ తొలి 2నెలల పాలనానంతరం కేవలం 38 శాతం ప్రజల మద్దతు పొందారు. తొలిసారి అధ్యక్ష పదవిని చేపట్టిన వారితో పోల్చినపుడు ఇది సగటున 20 పాయింట్లు తక్కువ. ట్రంప్‌ మరిన్ని పొరపాట్లు చేసి అపఖ్యాతి పాలైతే. అధ్యక్షుడిపై ప్రజా వ్యతిరేకత మరింత బలపడితే... రిపబ్లికన్లూ పునరాలోచించక తప్పదు. ఒకవేళ ఇప్పుడు అభిశంసన తేలేకపోతే 2018లో డెమొక్రాట్లకు మరో మంచి అవకాశం ఉంటుంది. ప్రతినిధుల సభకు 2018లో ఎన్నికలున్నాయి. ఒకవేళ డెమొక్రాట్లు మెజారిటీ సాధిస్తే... మొదటి అంకం వారికి సులువవుతుంది.

ఇతర మార్గాలూ ఉన్నాయి
అనారోగ్య కారణంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని అధికారాన్ని ఉపాధ్యక్షుడికి అప్పగించడానికి అమెరికా రాజ్యాంగం వీలు కల్పిస్తోంది. అలాగే అధ్యక్షుడి వైకల్యం లేదా అసమర్థత కారణంగా ఆయన్ను పదవి నుంచి బలవంతంగా తప్పించేందుకూ ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యక్షుడు, కేబినెట్‌లోని 15 మంది కీలక మంత్రులు నిర్ణేతలవుతారు. ఉపాధ్యక్షుడు, మంత్రుల్లో మెజారిటీ సభ్యులు ‘అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వర్తించే స్థితిలో లేరని భావిస్తే’ఈ మేరకు ప్రతినిధుల సభ స్పీకర్‌కు, సెనేట్‌ ప్రెసిడెంట్‌కు లిఖితపూర్వక సమాచారమిస్తే... సదరు అధ్యక్షుడు పదవికి దూరమవుతాడు.

ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేయవచ్చు. అయితే తొలగించిన అధ్యక్షుడిని శాశ్వతంగా పదవికి దూరంగా ఉంచాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమవుతుంది. అధ్యక్ష అభ్యర్థి పేరు మీదే ప్రజలు ఓట్లు వేస్తే అమెరికాలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది కాబట్టి... ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడిని ఈ తరహాలో దించిన సంఘటనలు అమెరికా చరిత్రలో చోటుచేసుకోలేదు. అయితే ప్రజావ్యతిరేకత పెరిగి... నిలకడలేని ట్రంప్‌ను వదిలించుకోవాల్సిన పరిస్థితి వస్తే... రిపబ్లికన్లకు ఇది కూడా ఒక మార్గం అవుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి.

అమెరికా చరిత్రలో అభిశంసనలు
1865 నుంచి 1869 దాకా అధ్యక్షుడిగా ఉన్న అండ్రూ జాన్సన్‌ మాజీ బానిసలకు పౌర హక్కులను కల్పించడాన్ని వీటో చేసి 1968లో అభిశంసన ఎదుర్కొన్నారు. అయితే ప్రతినిధుల సభలో నెగ్గినా... సెనెట్‌ తిరస్కరించడంతో పదవీకాలం పూర్తిచేసుకున్నారు. రిచర్డ్‌ నిక్సన్‌ 1974 వాటర్‌గేట్‌ కుంభకోణంలో పాత్రకుఅభిశంసనను ఎదుర్కొన్నారు. అయితే ప్రతినిధుల సభలో ఓటింగ్‌కు రాకముందే నిక్సన్‌ రాజీనామా చేశారు. మోనికా లూయిన్‌స్కీతో అక్రమ సంబంధాన్ని నెరిపి... దాన్ని దాచిపెట్టినందుకు బిల్‌ క్లింటన్‌ 1998లో అభిశంసనను ఎదుర్కొన్నారు. ప్రతినిధుల సభలో ఆయన అభిశంసన నెగ్గినా... సెనెట్‌ తిరస్కరించింది. ఈ ముగ్గురిపైనా అభిశంసన తీర్మానం పెట్టింది... ప్రమాణాన్ని ఉల్లంఘించారనే అభియోగం పైనే కావడం గమనార్హం.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు