ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయండి

30 Sep, 2013 03:47 IST|Sakshi
ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయండి

 న్యూయార్క్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తొలిసారి సమావేశమయ్యారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా ఉగ్రవాదంపైనే చర్చ జరిగినట్లు మీడియాతో జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ తెలిపారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యలో ద్వైపాక్షిక ఒప్పందాల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరు పక్షాలు చర్చించినట్లు చెప్పారు. ఇక్కడి మిడ్‌టౌన్ మాన్‌హటన్‌లోని న్యూయార్క్ ప్యాలస్ హోటల్‌లో ప్రధానులిద్దరూ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీమాంతర ఉగ్రవాదంపై మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఐక్యరాజ్యసమితి సమావేశం సందర్భంగా ఈ ఇద్దరూ కలుసుకోవాలని ముందే నిర్ణయమైనా.. మధ్యలో మన్మోహన్ వ్యాఖ్యలు, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడులతో ఈ ఇరువురి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
 
  ఐరాసలో ప్రసంగం సందర్భంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై మన్మోహన్ కఠిన స్వరంతో మాట్లాడారు. కాశ్మీర్‌లో మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. మరోపక్క దేశంలో ప్రతిపక్షాలు షరీఫ్‌తో సమావేశం రద్దు చేసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కాగా, మన్మోహన్‌ను గ్రామీణ మహిళ అని షరీఫ్ అభివర్ణించారనే వివాదం మరొకటి వెలుగులోకి వచ్చింది. తమపై బరాక్ ఒబామాకు ఫిర్యాదు చేయడంపై అసంతృప్తితో ఉన్న షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఒక పాక్ విలేకరి బయటపెట్టడంతో వివాదం మొదలైంది. అయితే ఆ జర్నలిస్ట్‌తో పాటు పాక్ దౌత్య అధికారులు కూడా దానిని ఖండించారు. ఇన్ని అడ్డంకుల మధ్య జరిగిన వారి సమావేశం ఫలవంతమవలేదు. కాగా, నవాజ్ భారత్‌కు రావాలని మన్మోహన్ ఆహ్వానించగా, ఆయన కూడా మన్మోహన్‌ను పాక్‌కు ఆహ్వానించారు.

>
మరిన్ని వార్తలు