‘మీ పద్ధతి అస్సలు బాగోలేదు’

28 Jan, 2019 20:32 IST|Sakshi

నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు : తులసి గబ్బార్డ్‌

వాషింగ్టన్‌ : మతాన్ని కారణంగా చూపి తనను ఎన్నికల్లో ఓడించాలని కొంతమంది వ్యక్తులు, మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తులసి గబ్బార్డ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతస్తురాలినైన కారణంగా తనను, తన మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగడం సరికాదని హితవు పలికారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినపుడు దిగిన ఫొటోలను ఆధారంగా చూపి నేను కేవలం ఒక మతానికి మాత్రమే విలువనిస్తానని దుష్ప్రచారం చేస్తున్న వాళ్లు.. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు మరికొంత మంది నా సహసభ్యులు కూడా మోదీని కలిసిన విషయాన్ని గుర్తించాలి. మత దురభిమానం గల వ్యక్తిగా నన్ను చిత్రీకరించే మీ పద్ధతి అస్సలు బాగోలేదు’  అంటూ ప్రత్యర్థులను విమర్శించారు.

ఎవరైనా బాధితులే కదా
‘ఈరోజు హిందువుని లక్ష్యంగా చేసుకున్నారు. రేపు ముస్లిం లేదా యూదు అమెరికన్లు, ఆఫ్రికన్‌ అమెరికన్లని లక్ష్యంగా చేసుకుంటారు. అయినా నేను భయపడను. కాంగ్రెస్‌ సభ్యురాలిగా ఎన్నికైన తొలి హిందూ వ్యక్తిగా నేను గర్వపడతున్నాను. అలాగే అగ్రరాజ్య అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి హిందువుగా కూడా ఆనందపడుతున్నాను. అయితే ఈ విషయం కొంతమందికి నచ్చడం లేదు. దేశం పట్ల నా బాధ్యత గురించి ప్రశ్నించాలి గానీ నా మతం గురించి కాదు. చెత్త రాజకీయాలు వద్దు. ఇతర నాయకుల వలె నాకు ద్వంద్వ విధానాలు చేతకావు. ఎందుకంటే నేను హిందువును. అయినా నిజమైన అమెరికన్లు మతం, వర్గం, లింగ భేదాలను అనుసరించి ఓటు వేయరు’ అంటూ తులసి వ్యాఖ్యానించారు. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం నాయకులతో చర్చలు జరపడం అతి సాధారణ విషయమని గుర్తించకపోవడం విచారకరమన్నారు. (అధ్యక్ష పదవికి పోటీ చేస్తా : తులసి)


కాగా అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలో దిగే తొలి హిందువుగా తులసి చరిత్రకెక్కనున్నారు. అలాగే 2020 ఎన్నికల్లో గెలుపొందితే ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళగా.. అత్యంత పిన్న వయస్సులో అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా... ఇలా పలు రికార్డులు ఆమె సొంతమవుతాయి. అమెరికన్‌ సమోవా సంతతికి చెందిన తులసి.. 2002లో హవాయి స్టేట్‌ లెజిస్లేటివ్‌గా ఎన్నియ్యారు. తద్వారా అత్యంత పిన్న వయస్సు(21)లో ఈ పదవి అలంకరించిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ నుంచి మొత్తం 12 మంది అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు అంచనా. ఎలిజబెత్‌ వారెన్, కిర్‌స్టెన్‌ గిల్లిబ్రాండ్, తులసీ గబ్బార్డ్‌, కమలా హ్యారిస్‌లు పోటీ విషయమై ప్రకటన చేయడంతో ట్రంప్‌పై పోటీకి ఎవరు నిలుస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎవరు గెలిచినా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారు.(చదవండి : అవును.. సీరియస్‌గా ఆలోచిస్తున్నా)

మరిన్ని వార్తలు