‘అధ్యక్ష’ పోటీపై సీరియస్‌గా ఆలోచిస్తున్నా..

14 Dec, 2018 02:38 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ఆ దేశ పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికైన మహిళ తులసి గబ్బార్డ్‌ వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికలపై తన స్పందన తెలపాల్సిందిగా గురువారం మీడియా ఆమెను ప్రశ్నించగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. దీంతో అధ్యక్ష పదవికి ఆమె పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలో దిగే తొలి హిందువుగా తులసి గుర్తింపు పొందుతారు.

ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆమె గెలుపొందితే అధ్యక్ష పదవి దక్కిన అతి పిన్న వయస్కురాలిగానూ చరిత్రలో నిలిచిపోతారు. హవాయ్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున నాలుగుసార్లు ఆమె దేశ ప్రతినిధుల సభకు ఎంపికయ్యారు. ఇండో– అమెరికన్లలో అత్యంత ప్రజాదరణ గల నేతగా తులసికి మంచి రికార్డు ఉంది. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ముందుగా ఆమె డెమోక్రటిక్‌ పార్టీ నేతలతో తలపడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆమె కొద్ది వారాల నుంచి పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే ఇండియన్‌ అమెరికన్ల అభిప్రాయాలను సైతం తీసుకుంటున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలోకి దిగనున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో భారత సంతతికి చెందిన సెనెటర్‌ కమలా హ్యారీస్, మాజీ ఉపాధ్యక్షుడు జోయ్‌ బిడెన్, సెనెటర్లు ఎలిజబెత్‌ వారెన్, క్రిస్టన్‌ గిల్లీబ్రాండ్, అమీ క్లోబుకార్, టిమ్‌ కైన్‌ తదితరులు ఉన్నారు.   

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు