అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా

13 Jan, 2019 04:45 IST|Sakshi
తులసీ గబార్డ్‌

హిందూ మహిళ తులసీ ప్రకటన

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువైన, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున నాలుగు సార్లు ప్రతినిధుల సభ ఎన్నికల్లో గెలిచిన తులసీ గబార్డ్‌ 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరో వారంలో తాను పోటీ చేస్తున్న విషయాన్ని లాంఛనంగా ప్రకటిస్తానన్నారు. డెమోక్రటిక్‌ పార్టీకే చెందిన సెనెటర్‌ ఎలిజబెత్‌ వార్రెన్‌ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో దిగనున్న రెండో మహిళ తులసి కానున్నారు.

భారత సంతతికి చెందిన సెనెటర్‌ కమలా హ్యారిస్‌ సహా మొత్తం 12 మంది అభ్యర్థులు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతారని అంచనా. తులసి హవాయ్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున నాలుగుసార్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఆమె తాజా నిర్ణయంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి హిందూ మహిళ తులసి కానున్నారు. ఒకవేళ గెలిస్తే అమెరికా అధ్యక్ష పదవికి అత్యంత పిన్న వయసులోనే ఎన్నికైన వ్యక్తిగా, అదే సమయంలో అగ్రరాజ్యానికి తొలి అధ్యక్షురాలిగా ఆమె రికార్డు నెలకొల్పుతారు. అయితే ఆమె గెలుస్తుందనే అంచనాలు తక్కువే. రిపబ్లిక్‌ పార్టీ తరఫున మళ్లీ పోటీచేయనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. వచ్చే నెల 3న ఐయోవా ప్రైమరీ ఎన్నికలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.

మరిన్ని వార్తలు