అధ్యక్ష పదవికి పోటీ చేస్తా : తులసి

12 Jan, 2019 09:48 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్‌ సభ్యురాలు తులసి గబ్బార్డ్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మరో వారం రోజుల్లో అధికారిక‍ ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ‘వాతావరణ మార్పులు, ఆరోగ్య పథకాలు, క్రిమినల్‌ జస్టిస్‌ తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను. ఇక అన్నింటి కంటే ముఖ్యమైన విషయం... శాంతిని పెంపొందించడం. ఇందుకోసం నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను. వీటన్నిటి గురించి సమగ్ర అవగాహన వచ్చిన తర్వాతే 2020 ఎన్నికల్లో పోటీ చేసే విషయమై నిర్ణయం తీసుకున్నా’ అని తులసి వ్యాఖ్యానించినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది.

ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం బరిలో దిగే తొలి హిందువుగా తులసి చరిత్రకెక్కనున్నారను. అలాగే ఎన్నికల్లో గెలుపొందితే ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళగా.. అత్యంత పిన్న వయస్సులో అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా... ఇలా పలు రికార్డులు ఆమె సొంతమవుతాయి. అమెరికన్‌ సమోవా సంతతికి చెందిన తులసి.. 2002లో హవాయి స్టేట్‌ లెజిస్లేటివ్‌గా ఎన్నియ్యారు. తద్వారా అత్యంత పిన్న వయస్సు(21)లో ఈ పదవి అలంకరించిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 2004లో అమెరికా ఇరాక్‌తో యుద్ధం ప్రకటించే నాటికే ఆమె సైన్యంలో చేరారు. ఆ తర్వాత కువైట్‌తో యుద్ధం జరిగినపుడు హవాయి నేషనల్‌ గార్డుగా, ఆర్మీ కెప్టెన్‌గా ఆమె సేవలు అందించారు. (చదవండి : అవును.. సీరియస్‌గా ఆలోచిస్తున్నా)

వివాదాలు- విదేశాంగ విధానం...
టెర్రరిజాన్ని వ్యతిరేకించే తులసి... 2017లో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ను కలిసేందుకు రహస్యంగా అక్కడికి వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ పర్యటనకు హౌజ్‌ ఎథిక్స్‌ కమిటీ అనుమతి ఉందని చెప్పినప్పటికీ ప్రత్యర్థులు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ‘ అతడిని కలిసే అవకాశం వచ్చింది. సిరియా ప్రజల పట్ల నిజమైన బాధ్యత ఉన్న వారెవరైనా నాలాగే చేస్తారు. వారి కష్టాలను స్వయంగా చూసే అవకాశం దక్కింది. శాంతిని పెంపొందించాలంటే చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. చర్చల ద్వారానే అది సాధ్యమవుతుంది. సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా అని అక్కడి ప్రజలు అడిగినపుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి తప్పు ఎవరిది’ అంటూ తులసి తన చర్యను సమర్థించుకున్నారు.

అంతేకాదు ఆల్‌ఖైదా, ఐసిస్‌ వంటి ఉగ్రసంస్థలకు ప్రత్యక్ష, పరోక్షంగా మద్దతు తెలిపే దేశాలకు అమెరికా సహకరించకూడదని, వారికి నిధులు ఇవ్వడం ఆపేయాలని కోరుతూ అదే ఏడాది కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు తులసి. ఈ సందర్బంగా..‘ ఐసిస్‌, ఆల్‌ఖైదా వంటి సంస్థలు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు సమకూర్చేది నేనైనా, మరెవరైనా సరే వారికి తప్పకుండా శిక్షపడాలి. వాళ్లను జైళ్లో పెట్టి తీరాలి. ఇటువంటి నిబంధనలను ఏళ్ల నాటి నుంచి అమెరికా ఉల్లంఘిస్తోంది’  అని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఇక సిరియా నుంచి సేనలను(పదాతి సేనలు) ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీచేసే క్రమంలో ఈ విషయమై తులసి ఎటువంటి హామీలు ఇవ్వనున్నారో అనే అంశంపై ఆస​క్తి నెలకొంది.

మరిన్ని వార్తలు