ప్రేమ సొరంగం.. టన్నెల్ ఆఫ్ లవ్..

5 May, 2016 02:13 IST|Sakshi
ప్రేమ సొరంగం.. టన్నెల్ ఆఫ్ లవ్..

టన్నెల్ ఆఫ్ లవ్.. అత్యద్భుతమైన పచ్చటి సొరంగం.. ఉక్రెయిన్‌లో ఉంది.. ఎన్నోసార్లు ఫేస్‌బుక్ వంటివాటిల్లో తరచూ కనిపించే చిత్రమిదీ.. 2011 ముందు వరకూ దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.. తర్వాత కొన్ని వెబ్‌సైట్లు దీన్ని వెలుగులోకి తెచ్చేసరికి ప్రేమికులకు, కొత్తగా పెళ్లిచేసుకునే వారికి ఇదో సందర్శనీయ స్థలంగా మారిపోయింది. రైల్వే ట్రాక్ చుట్టూ చెట్లు అల్లుకున్నట్లు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉండటం దీని ప్రత్యేకత. ఉక్రెయిన్‌లోని క్లెవాన్ సమీపంలో ఉన్న ఈ ప్రేమ సొరంగం వద్ద వెడ్డింగ్ ఫొటోలు తీసుకోవడానికి జంటలు తరలివస్తుంటాయి. అయితే.. ఈ మధ్య వరకూ ప్రేమ సొరంగం ఇలా ఏర్పడటం వెనుక ఉన్న విషయం వెలుగులోకి రాలేదు.
 
 ఇంతకీ అసలు సంగతేమిటంటే..
 ప్రచ్ఛన్న యుద్ధ కాలం సమయం నుంచీ ఇక్కడ ఓ రహస్య సైనిక స్థావరం ఉందట. దీంతో ఎవరి కంట పడకుండా సైనిక సామగ్రిని రవాణా చేసే ఉద్దేశంతో పట్టాల పక్కన చెట్లు పెంచడం మొదలుపెట్టారు. తర్వాతి కాలంలో ఈ మార్గం ద్వారా మిలటరీ సామగ్రి రాకపోకలు త గ్గాయి. అయినప్పటికీ ఇవి నీట్‌గా కట్ చేసినట్లు ఉన్నాయంటే దానికి కారణం.. దగ్గర్లోని ప్లైవుడ్ పరిశ్రమే. క్లెవాన్‌కు సమీపంలో ఉన్న ఓగ్రామం వద్ద భారీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉంది. దీంతో ఇక్కడ్నుంచి ప్లైవుడ్ రవాణా రైళ్ల ద్వారా సాగుతుంది. దాంతో వారే.. చెట్ల కొమ్మలు అడ్డం పడకుండా.. ఇలా ట్రిమ్ చేస్తూ ఉంటారు. అయితే.. ఈ మార్గం వెలుగులోకి రావడంతో వారి రైళ్ల రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతోందట. పర్యాటకులు ఫొటోలు తీసుకోవడానికి పట్టాలకు అడ్డంగా నిల్చుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయట.

మరిన్ని వార్తలు