టర్కీ బొగ్గుగనిలో భారీ విస్ఫోటం

15 May, 2014 01:12 IST|Sakshi
టర్కీ బొగ్గుగనిలో భారీ విస్ఫోటం

* 245 మంది కార్మికులు మృత్యువాత
* విద్యుత్ వ్యవస్థలో లోపంతోనే పేలుడు
* నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం: టర్కీ ప్రధాని

 
 సోమా (టర్కీ): పశ్చిమ టర్కీలోని ఒక బొగ్గుగనిలో భారీ విస్ఫోటం సంభవించింది. దీని కారణంగా మంటలు పెచ్చరిల్లడంతో 245 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 190 మంది పరిస్థితి తెలియరాకుండా ఉంది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. లోపల చిక్కుకున్న వారిని రక్షించడానికి సహా యక చర్యలు ముమ్మరం చేశారు. ఇస్తాంబుల్‌కు దక్షిణంగా 250 కి.మీ. దూరంలోని సోమా పట్టణంలో ఉన్న ఈ గనిని బుధవారం ఉదయం టర్కీ ప్రధాని రిసెప్ తయిప్ ఎర్డొగాన్ సందర్శించారు.
 
 టర్కీ గనుల ఘోర దుర్ఘటనల్లో దీనిని ఒకటిగా పేర్కొన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అంతక్రితం ఆయన దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశాలిచ్చారు. విద్యుత్ వ్యవస్థలో లోపంవల్లే పేలుడు జరిగిందని, ఆ సమయంలో 787 మంది గనిలో ఉన్నారని టర్కీ ఎనర్జీ మంత్రి చెప్పారు. కార్బన్‌మోనాక్సైడ్‌తో ఊపిరాడక కార్మికులు మృతి చెందారని, గని లోకి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. 2012 నుంచి ఇప్పటి వరకూ గనిని ఐదు సార్లు పరిశీలించామని, ఏవిధమైన ఉల్లంఘనలు కనుగొనలేదన్నారు. ఉపరితలానికి 2 కి.మీ. లోపల, ముఖద్వారానికి 4 కి.మీ. దూరంలో కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.  
 
 కార్మికులు షిఫ్టు మారే సమయం కావడంతో పేలుడు సమయంలో సాధారణం కంటే ఎక్కువ మంది గనిలో ఉన్నారని అధికారులు చెప్పారు. దీంతో ప్రమాదంలో చిక్కుకున్న వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ఇస్తాంబుల్‌లోని గని యజమాని ఆఫీసు వద్ద ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అవి ఉధృతరూపం దాల్చడంతో ఆందోళనకారుల్ని అదుపులోనికి తీసుకురావడానికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. గనిలో చిక్కుకున్న వారి బంధువులు తమ వారి సమాచారం కోసం గని వద్ద ఆత్రు తగా ఎదురు చూస్తున్నారు. మృత్యువాత పడ్డవారి బంధువుల రోదనలతో గని ప్రాంతం హృదయవిదారకంగా మారింది. అంతక్రితం 1992లో జరిగిన గని ప్రమాదంలో 263 మంది మరణించారు. తర్వాత కూడా మరిన్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాలకు గనుల్లో సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు