ఆమె బ్యాగు ఖరీదుతో 11 మంది బతికేస్తారు!!

3 Jul, 2019 11:02 IST|Sakshi

అంకారా : టర్కీ ప్రథమ మహిళ ఎమీనే ఎర్డోగాన్‌ జీవనశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఉంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు ఇలా ప్రవర్తించడమేమిటని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు విషయమేమిటంటే.. ఇటీవల జరిగిన జీ 20 దేశాల సదస్సుకు టర్కీ అధ్యక్షుడు రెసీప్‌ తయీప్‌ ఎర్డోగన్‌ తన సతీమణి ఎమీనేతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా భర్తతో కలిసి విమానం దిగుతున్న ఎమీనే ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.

ఈ క్రమంలో ఎమీనే చేతిలోని బ్యాగు అందరినీ ఆకర్షించింది. దీని ధర 50 వేల అమెరికా డాలర్లు(సుమారు 35 లక్షల రూపాయలు)గా గుర్తించిన నెటిజన్లు ప్రథమ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమీనే చేతిలోని బ్యాగు విలువ.. దాదాపు 11 మంది టర్కీ పౌరుల వార్షికాదాయానికి సమానమని... దానితో వారి కుటుంబాలు హాయిగా జీవిస్తాయని కామెంట్లు చేస్తున్నారు. దేశ పౌరులు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంటే అధ్యక్ష భవనంలో ఉన్న వ్యక్తులు మాత్రం ఇలా విలాసవంతమైన జీవనం గడుపుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టు నుంచి టర్కీ తీవ్రస్థాయిలో ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయని, అయినప్పటికీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ మాత్రం ఇవేమీ పట్టనట్టు జల్సాగా పర్యటనలు చేస్తున్నారంటూ స్థానిక పత్రికలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

మరిన్ని వార్తలు