204 కంపెనీలపై పోలీసుల దాడులు

18 Aug, 2016 17:41 IST|Sakshi
204 కంపెనీలపై పోలీసుల దాడులు

అంకారా: దేశంలో సైనిక తిరుగుబాటుకు సహకరించిన వారిపై టర్కీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జులై 15న సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. ఆ తిరుగుబాటుదారులకు సహాయం అందించిన వారిని గుర్తించి ప్రభుత్వం కఠినశిక్షలు విధిస్తోంది. తాజాగా టర్కీలోని 18 నగరాల్లో ఉన్న 204 కంపెనీలపై గురువారం పోలీసులు దాడులు జరిపారు. ఈ కంపెనీలు తిరుగుబాటుదారులకు ఆర్థిక సహాయం అందించాయన్న కారణంతో వాటిపై దాడులు నిర్వహించినట్లు వార్తా సంస్థ జిన్హువా  తెలిపింది. ఈ కంపెనీలకు సంబంధించిన 187 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రఖ్యాతిగాంచిన కంపెనీల ప్రతినిధులు సైతం పలువురు ఉన్నట్లు సమాచారం.

తిరుగుబాటుకు ప్రయత్నించిన నాటి నుంచి ఇప్పటివరకు 40 వేల మందికి పైగా ప్రజలను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. తిరుగుబాటు సందర్భంగా 237 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుగుబాటుదారులపై ప్రభుత్వ చర్యలు మానవహక్కులను కాలరాసేలా ఉన్నాయని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
 

>
మరిన్ని వార్తలు