యువకుడిని రక్షించిన టర్కీ అధ్యక్షుడు

26 Dec, 2015 19:42 IST|Sakshi
యువకుడిని రక్షించిన టర్కీ అధ్యక్షుడు

ఇస్తాంబుల్‌: టర్కీ దేశంలోని ఇస్తాంబుల్‌లో సుసైడ్‌ స్పాట్‌గా పేరుగాంచిన ఎత్తైన వంతెనది. అదే బొస్పొరస్‌ బ్రిడ్జి. దీని ఎత్తు 64 మీటర్లు(211 అడుగులు). తరుచూ ఆత్మహత్యలు చేసుకోవడానికి వచ్చేవారికి ఈ బ్రిడ్జి ఐకాన్‌గా మారింది. అలాంటి ప్రదేశంలోకి ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు ఓ 30 ఏళ్ల యువకుడు. జీవితం మీద విరక్తితో ఆ యువకుడు... తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే సరైన ప్రదేశమని ఎంచుకున్నాడు కాబోలు. అనుకున్నదే తడువుగా ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఇంతలో ఆత్మహత్య చేసుకోవద్దంటూ వెనక నుంచి ఓ పిలుపు వినిపించింది. ఎవరా అని వెనుదిరిగి చూశాడా యువకుడు.

ఆయన ఎవరో కాదు టర్కీ అధ్యక్షుడు రీసిప్‌ త్యాప్‌ ఈర్డోగన్‌. సాక్షాత్‌ దేశ అధ్యక్షుడే ఆ యువకుడి ప్రాణాలను రక్షించాడు. శుక్రవారం ప్రార్థనలు ముగించుకున్న అనంతరం భారీ రక్షకదళాల వాహనాల నడుమ కారులో వెళుతున్న అధ్యక్షుడి రీసిప్‌కు ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ యువకుడు తారసపడ్డాడు. వెంటనే కారును ఆపి యువకుడిని ఆత్మహత్య చేసుకోవద్దంటూ వారిస్తూ అడ్డుకున్నారు. యువకుడిని తీసుకురమ్మని సెక్యూరీటీ అధికారులను ఆదేశించారు.  కారులో కూర్చొని విండోలో నుంచి యువకునితో మాట కలిపారు. దాంతో యువకుడు కుటుంబ సమస్యలతో జీవితం మీద విరక్తి చెంది ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పాడు. కొన్ని క్షణాల తరువాత ఆ యువకుడు కృతజ్ఞత భావంతో అధ్యక్షుడు రీసిప్‌ చేతిని ముద్దుపెట్టుకున్నాడు.

మరిన్ని వార్తలు