బెడ్‌రూంలో టీవీ ఉండకూడదట!

27 Sep, 2017 20:30 IST|Sakshi

వాషింగ్టన్‌(యూఎస్‌ఏ): చదువుకునే పిల్లలున్న ఇంట్లో టీవీ ఎక్కడుండాలి? బెడ్‌రూంలో మాత్రం కచ్చితంగా ఉండొద్దంటున్నారు పరిశోధకులు. ఒకవేళ పడక గదిలోనే టీవీ ఉంటే బోలెడన్ని అనర్థాలు జరుగుతాయని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. ఇయోవా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు దీనిపై విస్తృత అధ్యయనం చేసి, విస్తుగొలిపే వాస్తవాలను వెలికితీశారు. టీవీ కానీ, వీడియో గేమ్‌ సిస్టమ్‌ కానీ బెడ్‌రూంలో ఉంటే.. పిల్లలు వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తారని... ఫలితంగా నిద్ర సమయం, చదువుకునే సమయం తక్కువై చివరికి ఈ ప్రభావం వారి మార్కులపై పడుతుందని తేలింది.

అంతేకాదు, ఇలాంటి చిన్నారులు అంతచురుగ్గా ఉండలేరని, అంతిమంగా ఊబకాయం బారినపడతారని వెల్లడయింది. ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు వివిధ అంశాల్లో చిన్నారుల పనితీరును అధ్యయనంగా చేయగా ఈ విషయాలు రూఢీ అయ్యాయి. ఈ పిల్లల్లో హింసాప్రవృత్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. దుందుడుకుగా ప్రవర్తిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు..తమ పిల్లల్లో ఇలాంటి మార్పులను అంతగా పట్టించుకోవటం లేదు. బెడ్‌రూంలో టీవీలు చూసే అలవాటున్న పిల్లలు.. విద్యా సంబంధ, క్రీడా సంబంధ కార్యక్రమాలపై అంతగా ఆసక్తి చూపరు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల జోక్యం కూడా తక్కువగానే ఉంటుంది. పిల్లలే తమకు నచ్చిన కార్యక్రమాలను చూస్తుంటారు. దీనిపై తల్లిదండ్రులు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు.

ఇలాంటప్పుడు వారికి చదువుకునే సమయం కూడా తక్కువగానే ఉంటుంది. వారంలో సరాసరిన 60 గంటలపాటు చిన్నారులు టీవీల ముందే గడిపేస్తున్నారు. స్మార్టుఫోన్లు కూడా ఇంతే ప్రభావాన్ని పిల్లలపై చూపుతున్నాయని వర్సిటీ ప్రొఫెసర్‌ డగ్లస్‌ జెంటిల్‌ తెలిపారు. దేశంలోని 4-6 ఏళ్ల గ్రూపులోని 40 శాతం మంది చిన్నారుల ఇళ్లల్లోని బెడ్‌రూంలలో టీవీ లేదా వీడియోగేమ్‌ ఉన్నట్లు తేలింది. అయితే, చాలామంది తల్లిదండ్రులు మాత్రం టీవీ బెడ్‌రూంలో ఉంటే ఏంటి, ఇంకే రూంలో ఉంటేనేం అన్నట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. బెడ్‌రూంలో టీవీలు లేని ఇళ్లలోని చిన్నారులు చదువులో ముందుండటంతోపాటు ఆటలు ఆడటం వల్ల చురుగ్గా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమని ఆయన అంటున్నారు. తాజాగా, డెవలప్‌మెంటల్‌ సైకాలజీ జర్నల్‌లో ఈ విషయాలు ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు