బాంబు పేలుళ్లు.. 165 మంది మృతి

3 Jul, 2016 20:24 IST|Sakshi
బాంబు పేలుళ్లు.. 165 మంది మృతి

బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్ లో నరమేధం సృష్టించారు. శనివారం అర్థరాత్రి సమయంలో రాజధాని బాగ్దాద్లో వరుస బాంబు పేలుళ్లతో రాక్షసకాండ సాగించారు. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ముష్కర మూక బాంబు దాడులకు తెగబడింది. రద్దీగా ఉన్న వాణిజ్య సముదాయాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడుల్లో 165 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 125గా బీబీసీ పేర్కొంది. ఎంత మంది మృతి చెందారనేది ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.

రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ మాల్స్ ప్రాంతాలు రద్దీగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్రాడ ప్రాంతంలో జరిగిన మొదటి దాడిలో ఉగ్రవాదులు రిఫ్రిజిరేటర్లు, కారులో పేలుడు పదార్దాలను నింపి పేల్చివేశారు. ఈ ఘటనలో వంద మందిపైగా మందికి పైగా మృతి చెందారు. భారీ పేలుడు దాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా మృతదేహాలతో ఈ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అల్ షాబ్ ప్రాంతంలోని మార్కెట్ వద్ద జరిగిన కారుబాంబు దాడిలో ఐదుగురు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన ప్రధాని హైదర్ అల్-అబాదిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నుంచి ఫాజుల్లా నగరాన్ని ఇరాక్ బలగాలు స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు