ట్విటర్‌లో మరో కొత్త ఫీచర్ 

18 Jun, 2020 12:34 IST|Sakshi

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో మరో సరికొత్త ఫీచర్ ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. యూజర్లు తమ వాయిస్‌ని ఉపయోగించి ట్వీట్ చేసేలా కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించామని  ట్విటర్  ప్రకటించింది. ఒకే ట్వీట్‌లో 140 సెకన్ల వరకు ఆడియోను కూడా జోడించేందుకు ఈ  వాయిస్ ఫీచర్ అవకాశం కల్పించనుంది.  

ట్విటర్ ప్రొడక్ట్ డిజైనర్,సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాయప్యాటర్సన్, రెమి బౌర్గైన్  బ్లాగులో ఈ విషయాన్ని వెల్లడించారు. తమ తాజా ఫీచర్ ఆకట్టుకుంటుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తికరమైన విషయాలతోపాటు, బ్రేకింగ్ న్యూస్ ను కూడా వాయిస్ ట్వీటింగ్ ద్వారా షేర్ చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు  280 అక్షరాల ఇబ్బంది ఉండదని,  అలాగే అనువాద  చిక్కులు కూడా తొలగిపోతాయన్నారు.  ప్రస్తుతానికి ఐఓఎస్ లో  ప్రయోగ దశలో ఉన్న ఆ వాయిస్ ఫీచర్ రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఐఓఎస్ వినియోగదారుడికి పూర్తిగా అందుబాటులోకి రానుంది. ట్విటర్ హోమ్‌పేజీ లోని కొత్త వేవ్‌లెన్త్స్ ఐకాన్ ద్వారా వినియోగదారులు ఈ వాయిస్ ట్వీట్ చేయవచ్చు. సాధారణ ట్వీట్ల మాదిరిగానే యూజర్లు రీట్వీట్ చేయవచ్చు. వినవచ్చు. వాటికి ప్రత్యుత్తరం కూడా ఇవ్వవచ్చు.

ట్వీట్ కంపోజ్ చేసేటప్పుడు, కెమెరా ఐకాన్ పక్కన వేవ్‌లెన్త్స్ చిహ్నం కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి అనంతరం దిగువన ఉన్న రికార్డ్ బటన్‌ క్లిక్ చేసి 140 సెకన్ల వరకు వాయిస్‌ని రికార్డ్ చేయవచ్చు.  రికార్డింగ్ పూర్తి అయ్యాక.. రికార్డింగ్‌ను ఆపివేయడం మర్చిపోకూడదని ట్విటర్ సూచించింది.   కాగా ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా ఫ్లీట్స్ అనే కొత్త  ఫీచర్‌ను  ఇటీవల రూపొందించింది. అయితే దీనికి  మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు