'ట్రంప్ ను ఆపడానికి వీలులేదు'

12 May, 2017 11:36 IST|Sakshi
'ట్రంప్ ను ఆపడానికి వీలులేదు'
శాన్ ఫ్రాన్సిస్కో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనలకు వారధి ట్విట్టర్.  ఈ సామాజిక మాధ్యమం ద్వారానే ట్రంప్ తన అభిప్రాయాలను, ఆదేశాలను ఎక్కువగా జారీచేస్తుంటారు. అయితే ట్వీట్ చేయకుండా ట్రంప్ ను ఎవరూ ఆపడానికి వీలులేదని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడి ట్రంప్ ట్వీట్లు ఎంతో ముఖ్యమైనవనిగా ఆయన అభివర్ణించారు. జవాబుదారీ కోసమన్నా ఆయన చెప్పేది వినడం ఎంతో ముఖ్యమని చెప్పారు. విల్లీ గీస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డోర్సే తన అభిప్రాయాలను పంచుకున్నారు.
 
''మన నాయకుడి నుంచి డైరెక్టుగా అభిప్రాయాలు వినడం మనకెంతో అవసరమని నేను నమ్ముతున్నా. జవాబుదారీతనానికి ఇది ఎంతో అవసరం. మూసి ఉన్న గదుల మధ్య మాట్లాడుకోవడం కంటే, ఓపెన్ గా చర్చించుకోవడం  ఎంతో ముఖ్యమని నేను విశ్వసిస్తా. ఒకవేళ ఈ ప్లాట్ ఫామ్స్ నుంచి హఠాత్తుగా వైదొలిగితే, ఎక్కడి వెళ్లేది, ఏం జరుగుతుంది? అంతా చీకటిమయమవుతుంది. ఇది అందరికీ మంచిదని నేను అనుకోవడం లేదు'' అని జాక్ డోర్సే చెప్పారు.
 
ట్విట్టర్ యూజర్లు 328 మిలియన్లకు పెరిగారని, దీనికి గల ప్రధాన కారణం  రాజకీయ ఉనికి బలపడటం, ట్రంప్ ట్వీట్లేనని చెప్పారు. కొన్ని సార్లు ట్రంప్ ట్వీట్లు చాలా వివాదాస్పదంగా, నొచ్చుకోలేనివిగా కూడా ఉంటున్నాయని చెప్పారు. ట్రంప్ ట్వీట్లు అంతా మంచికేనని అంత సులభతరంగా చెప్పలేమని కూడా తెలిపారు. కానీ ట్రంప్ ను ట్వీట్ చేయకుండా ఆపలేమని స్పష్టంచేశారు. ఇన్ ఛార్జ్ ల నుంచి ప్రత్యక్షంగా సంభాషణలు నిర్వర్తించడమే మంచిదని జాక్ డోర్సే చెప్పారు.  
 
మరిన్ని వార్తలు