'ట్విట్టర్ అడ్డంకులు తొలగిపోయాయ్'

26 Dec, 2015 13:48 IST|Sakshi
'ట్విట్టర్ అడ్డంకులు తొలగిపోయాయ్'

సుమారు దశాబ్దం చరిత్రగల సోషల్ మీడియా నెట్వర్క్ సంస్థ ట్విట్టర్.. యూజర్ సేఫ్టీ కోసం చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయని ఆ సంస్థ యూరప్ ప్రతినిధి బ్రూస్ డైస్లీ స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రతికూల వార్తలతో ట్విట్టర్ వెనుకబడి పోతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

30 కోట్లకు పైగా యూజర్లతో 33 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న ట్విట్టర్ సంస్థపై ఇటీవల పలు విమర్శలు వస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్ల ద్వారా అభ్యంతరకరమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా ఈ మాద్యమం బాగా ఉపయోగపడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఎన్నో ఏళ్లుగా ట్విట్టర్ను ఆదరిస్తున్న కొందరు ప్రముఖులు సైతం ఇటీవల తమ అకౌంట్లను క్లోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైస్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
 
అక్టోబర్లో సంస్థ సీఈవోగా జాక్ డోర్సీ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రతికూల అంశాల నుండి ట్విట్టర్ నిలదొక్కుకుందని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రత, ఇతర రక్షణ విషయాల్లో సంస్థ చేపట్టిన ప్రణాళికలు విజయవంతం అయినట్లు వెల్లడించారు. వినియోగదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అభ్యంతరకరమైన అకౌంట్ల సంఖ్యను తగ్గించినట్లు తెలిపారు. అలాగే ఫోన్ ద్వారా వెరిఫికేషన్ను చేపట్టి అకౌంట్ను నిర్వహిస్తున్న వ్యక్తుల వివరాలను సమగ్రంగా నమోదు చేయడంలో చాలా వరకు సఫలీకృతం అయినట్లు డైస్లీ తెలిపారు.

మరిన్ని వార్తలు