ఐఎస్ఐఎస్కు ట్విట్టర్ అడ్డుకట్ట!

21 Feb, 2016 17:37 IST|Sakshi

వాషింగ్టన్: సోషల్ మీడియా ద్వారా యువతను పెద్ద సంఖ్యలో ఆకర్షించే ఐఎస్ఐఎస్కు ఇటీవలికాలంలో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఎదురుగాలి వీస్తున్నట్లు తేలింది. పారిస్ దాడుల నేపథ్యంలో ట్విట్టర్ సంస్థ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ, సైబర్ అండ్ హోం లాండ్ సెక్యురిటీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో తేలింది.

పారిస్ దాడుల అనంతరం ఐఎస్ఐఎస్ మద్దతుదారుల ఖాతాలను ట్విట్టర్ సంస్థ సస్పెండ్ చేస్తోంది. ఈ చర్య మూలంగా సోషల్ మీడియాలో ఐఎస్ఐఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని పరిశోధనలకు నేతృత్వం వహించిన జే ఎం బెర్గర్ తెలిపారు.  ఐఎస్ఐఎస్ మద్దతు దారుల ఖాతాలను ట్విట్టర్ నుండి తొలగించినప్పుడు వారు తిరిగి కొత్త ఖాతాలను ప్రారంభించుకున్నప్పటికీ ఇంతకు ముందున్న ఫాలోవర్ల సంఖ్యను మాత్రం పొందలేకపోతున్నారని.. ఇది ఐఎస్ఐఎస్ ప్రచార కార్యక్రమంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇతర బ్లాగింగ్ సైట్లను సైతం ఐఎస్ఐఎస్ మద్దతుదారులు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆ చిన్న, ఆంక్షలతో కూడిన సామాజిక అనుసంధాన వేదికలు అంతగా ప్రభావాన్ని చూపలేకపోతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు