పాస్‌వర్డ్స్‌ మార్చుకోండి

5 May, 2018 04:47 IST|Sakshi

యూజర్లకు ట్వీటర్‌ పిలుపు  

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్వీటర్‌ను వినియోగిస్తున్న 33 కోట్ల యూజర్లూ తమ ఖాతాల పాస్‌వర్డ్స్‌ మార్చుకోవాలని  ట్వీటర్‌ కోరింది. ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ట్వీటర్‌ ఈ ప్రకటన చేసింది. సోషల్‌ మీడియా ఖాతాల డేటా అమ్ముకుంటున్నారని, చోరీ జరుగుతోందనే ఆరోపణలు గట్టిగా వినవస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ట్వీటర్‌లో సమస్య తలెత్తింది.

దీంతో ఆ సంస్థ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. పాస్‌వర్డ్‌ల చోరీ గాని, సమాచార దుర్వినియోగం గాని జరిగిందా అనే అంశంపై విచారణ చేసింది. ఇందులో అలాంటివేమీ జరగలేదని వెల్లడైంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా తమ పాస్‌వర్డ్స్‌ మార్చుకోవాలని సూచించింది. అయితే ట్వీటర్‌లో తలెత్తిన సమస్య ఎన్ని పాస్‌వర్డ్స్‌పై ప్రభావం చూపిందనే విషయాన్ని వెల్లడించలేదు. ఇదే పాస్‌వర్డ్‌ ఇంకా ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారో అక్కడా మార్చుకుంటే మంచిదని సూచించింది.  

మరిన్ని వార్తలు