కన్నీళ్లు పెట్టించిన కట్టు కథ

14 Jan, 2016 16:01 IST|Sakshi
కన్నీళ్లు పెట్టించిన కట్టు కథ

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో కోమో అనే అమ్మాయిని కామోద్రేకులు రేప్ చేసి, హత్య చేశారనే వార్తా కథనం మూడు రోజులుగా సోషల్ వెబ్‌సైట్ ‘లో సంచలనం సృష్టించింది. ఈ వార్తను చదివిన యూజర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. సానుభూతి కురిపించారు. అయ్యో పాపం! అంటూ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు సంతాపం కూడా ప్రకటించారు. దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ పత్రికలు కూడా ఆ వార్తా కథనాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. యవ్వన ప్రాయంలోనే ఓ యువతి జీవితంతో ఆడుకున్నారని, అన్యాయంగా ఆమె జీవితాన్ని అర్ధంతరంగా ముగించారని వ్యాఖ్యలు చేశాయి. కోమో నీకు అశ్రు అంజలి ఘటిస్తున్నామంటూ ఎక్కడిలేని జాలి కురిపించాయి. దక్షిణాఫ్రికా మహిళా విభాగం కూడా తీవ్రంగానే స్పందించింది. మహిళలకు, పిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగిన ఎదురించండూ పిలుపు కూడా ఇచ్చింది. చివరకు అది కట్టుకథ అని తేలింది.

సోషల్ మీడియా, ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో తప్పుడు వార్తలు, వార్తా కథనాలు వాస్తవాలకన్నా వేగంగా ప్రచారం అవుతున్నాయంటూ ఇటలీ సోషల్ సైన్స్ విభాగానికి చెందిన నిపుణులు ఓ అధ్యయనంలో వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలోనే ట్విట్టర్‌లో కూడా ఓ కట్టుకథ ప్రచారం అవడం ఆందోళనకరమైన అంశం. ఎట్ ది రేట్ ఆఫ్ జస్ట్‌కుతి అనే ట్విట్టర్ యూజర్ తన స్నేహితురాలు కామోను అన్యాయంగా రేప్ చేసి హత్య చేశారన్న వార్తాకథనాన్ని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాతోపాటు ప్రింట్ మీడియా కూడా ఆ కథనానికి ప్రాధాన్యత నిచ్చి తప్పులో చేతులు కాల్చుకున్నాయి. తాను పోస్ట్ చేసిన వార్తా కథనం ఓ కాపీ కథని కుతి ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు వెల్లడించింది. నెట్‌లో ఓ కథను చదివిన తాను కన్నీళ్లు పెట్టుకున్నానని, దేశం విడిచి పారిపోదామనుకున్నానని, వ్యూయర్ల స్పందనను కూడా తెలుసుకునేందుకు  దాన్ని కాపీ కొట్టి క్యారెక్టర్లను మార్చేసి ఈ కొత్త కథను సోషల్ మీడియా ముందుంచానని తెలిపింది. కాపీ కథలను రాయడం తనకు అలవాటని కూడా తెలిపింది.

తాను రాసిందీ, పోస్ట్ చేసిందీ కట్టుకథే అయినప్పటికీ సమాజంలో ఆడవాళ్ల పరిస్థితి ఇంతే దారుణంగా ఉందని, అందరిని తప్పుదోవ పట్టించినందుకు తనను క్షమించాలని, ఏదేమైనా ఇది మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసిందని సమర్థించుకుంది. తప్పుడు వార్తాకథనాన్ని ప్రచురించిన కొన్ని పత్రికలు కూడా జరిగిన పొరపాటుకు మరుసటి రోజు వివరణ ఇచ్చుకున్నాయి.  ‘మా ముఖాలు సిగ్గుతో కందిపోయాయి. పొరపాటును గ్రహించాం. నిజానిజాలను నిర్ధారించుకోకపోవడానికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం. ఇది నిజంగా జర్నలిజం కాదు. ఇది మాకు, మా పరిశ్రమకు గుణపాఠం’ అని ఓ పత్రిక సంపాదకుడు కెవిన్ రిట్చీ వ్యాఖ్యానించారు.

కుతిది కట్టుకథే కావచ్చు. మహిళలు, పిల్లలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసమాత్రం అక్షరాల నిజమని, సమాజంలో కామో లాంటి వాళ్లు ఎందరో ఉన్నారని ట్విట్టర్ మహిళా విభాగం వ్యాఖ్యానించింది. మరి కన్నీటి స్పందనల్లో కూడా ఎన్ని కట్టుకథలు ఉన్నాయో!

మరిన్ని వార్తలు