గాలి ఎటు వస్తే అటు తిరిగే ఈ ఇళ్లు అద్భుతం

8 Aug, 2016 16:00 IST|Sakshi
గాలి ఎటు వస్తే అటు తిరిగే ఈ ఇళ్లు అద్భుతం

న్యూయార్క్: మన ఇల్లు కాస్తంత కదిలేతేనే ఒళ్లంతా జలదరించిపోయి బయటకు పరుగులు తీస్తాం.. అలాంటిది గాలి ఎటు వస్తే అటు వైపే ఇళ్లు మొత్తం తిరిగేలా ఉండి అందులో ఉండాల్సి వస్తే.. ఉండగలరా.. అసలు అలాంటి నిర్మాణం సాధ్యమేనా.. అంటే అది సాధ్యమని చూపించడమే కాదు అందులో ఉండవచ్చని కూడా ఓ ఇద్దరు వ్యక్తులు నిరూపించారు. అలెక్స్ షెవెదర్, వార్డ్ షెల్లీ అనే ఇద్దరు 2007నుంచి కలిసి పనిచేస్తున్న ప్రముఖ ఆర్టిస్టులు. అద్భుతంగా గృహనిర్మాణాలు చేయడంలో వీరు సిద్ధహస్తులు. ఇప్పటి వరకు భిన్న విధాల నిర్మాణాలను ఆవిష్కరించిన ఆ ఇద్దరు సరికొత్తగా ఆలోచించారు.

అంతరిక్షంలో తేలియాడే వస్తువుపై ఉంటే ఎలాంటి ప్రభావం పడుతుందో అన్న ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే గాల్లో తేలియాడే నివాస నిర్మాణానికి తెరతీశారు. న్యూయార్క్ లోని గెంట్ లో గల ఓమి ఇంటర్నేషనల్ ఆర్ట్స్ సెంటర్ లో ఒక పెద్ద గుండ్రటి సిమెంట్ పిల్లర్ ఏర్పాటుచేసి దానిపై గాలి ఎటువస్తే అటు తిరిగేలా రియాక్టర్ అనే ఓ ఇంటిని నిర్మించారు. 8అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటుచేశారు. అనంతరం ఏంచక్కా వారిద్దరు ఆ ఇంట్లో ఐదు రోజులు గడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇది కేవలం గాలికి తిరగడమే కాదు.. వీరు నడుస్తున్న సందర్భంగా వారి బరువుకు తగినట్లుగా వంగిపోవడం కూడా జరుగుతోంది. ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు పలువురు రాగా ఆ ఐదు రోజుల్లో తాము పొందిన అనుభవాలను వారికి వివరించారు. రెండు సంవత్సరాలపాటు ఈ గృహాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ లో కొద్ది రోజులు వారిద్దరు ఈ ఇంట్లోనే ఉంటారంట. ఈ ఐదు రోజుల్లో వారు ఆ ఇంట్లో ఉండి తుపానును కూడా సమర్థంగా ఎదుర్కున్నారు.   

>
మరిన్ని వార్తలు